హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): గతంలో గేట్లకు తాళాలు వేలాడిన పరిశ్రమలు నేడు నిత్యం ఉత్పత్తులతో కళకళలాడుతున్నాయి. పవర్ హాలిడేలు, కరెంటు కోతలకు శాశ్వతంగా తెర పడటంతో తెలంగాణలో పారిశ్రామిక రంగానికి స్వర్ణయుగం వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క షిఫ్టు కూడా సక్రమంగా పనిచేయని పరిశ్రమలు, నేడు మూడు షిఫ్టుల్లో ఉత్పత్తి కొనసాగిస్తున్నాయి. నాణ్యమైన నిరంతర విద్యుత్తు సరఫరాతో ఇంధన, నిర్వహణ ఖర్చులు తగ్గిపోయి ఉత్పత్తులు 100 శాతానికి చేరుకొన్నాయి. దీంతో పరిశ్రమల యజమానులతోపాటు కార్మికులు, ఉద్యోగులు, పరిశ్రమలపై ఆధారపడిన ఇతర రంగాలవారు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు.
తెలంగాణ పునర్నిర్మాణం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర వివక్షకు గురై వెనుకబడిపోయిన తెలంగాణ.. రాష్ట్రంగా ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్, రాష్ట్ర పునర్నిర్మాణంపై దృష్టిపెట్టారు. వ్యవసాయం తరువాత పారిశ్రామికరంగాన్ని ప్రాధాన్యత రంగంగా గుర్తించారు. అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలంతా ముక్తకంఠంతో కోరింది విద్యుత్తు సమస్య పరిష్కారించాలనే. ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వకపోయినా సరే కానీ తమకు నిరంతర విద్యుత్తు ఇవ్వాలని కోరారు. దీంతో సీఎం కేసీఆర్ ఇతర రాష్ర్టాల నుంచి కరెంటును కొనుగోలు చేసి అనతికాలంలోనే నిరంతర విద్యుత్తు సరఫరా కలను సాకారం చేశారు. దీంతో నేడు అన్ని రంగాలతోపాటు పారిశ్రామికరంగం కూడా కళకళలాడుతున్నది. కార్మికులు, ఉద్యోగులకు చేతినిండా పని లభిస్తున్నది. మన రాష్ట్రమే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, హర్యానా తదితర రాష్ర్టాల నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు మన రాష్ట్రంలోని పారిశ్రామికవాడల్లో ఉపాధి పొందుతున్నారు.
ఆరు నెలల్లోనే పరిష్కారం
నిజానికి రాష్ట్రం ఏర్పడినప్పుడు పరిశ్రమలు తీవ్ర విద్యుత్తు కోతలతో సంక్షోభంలో ఉన్నాయి. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో విద్యుత్తు సంస్థలు తీవ్రంగా శ్రమించి ఆరు నెలల్లోనే 24 గంటల నిరంతరాయ విద్యుత్తును సరఫరా చేయడం మొదలుపెట్టారు. జూన్ 2, 2014 నాడు రాష్టం ఏర్పడితే.. 2014 నవంబర్ నుంచే గృహ, వాణిజ్య రంగాలతోపాటు పారిశ్రామిక రంగానికి కూడా 24 గంటల విద్యుత్తును అందివ్వడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అసలు కోతలంటూ లేకుండా పారిశ్రామిక రంగానికి విద్యుత్తును అందిస్తుండటంతో కొత్త పరిశ్రమలకు తెలంగాణ మజిలీగా మారింది.
సమయానికి ఎగుమతులు
పరిశ్రమల శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో కుటీర, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) 26 లక్షల వరకు ఉండగా, దాదాపు 50 లక్షలమంది వరకూ వీటిల్లో పనిచేస్తున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, లైఫ్ సైన్సెస్, ఇంజినీరింగ్, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్, ప్లాస్టిక్ అండ్ పాలిమర్స్ తదితర పరిశ్రమలు ఇందులో ముఖ్యమైనవి. బల్క్ డ్రగ్స్, ఔషధాలు, ఇంజినీరింగ్, కెమికల్స్, కెమికల్ ఆధారిత ఉత్పత్తులు, చేనేత ఉత్పత్తులు, వస్ర్తాలు, ఆభరణాలు, ప్లాస్టిక్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆహార పదార్థాలు ఇక్కడినుంచి ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. నాడు విద్యుత్తు కోతలతో పనులు నడువక నిర్దేశిత సమయానికి ఎగుమతులు చేయలేని పరిస్థితులు ఉండేవి. దీంతో చాలాసార్లు ఆర్డర్లు క్యాన్సిల్ అయ్యి కంపెనీలు నష్టపోయేవి కూడా. నేడు పుష్కలమైన కరెంటుతో నిరంతరం పని నడుస్తుండటంతో ఒప్పందం కంటే ముందుగానే కంపెనీలు తమ ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. దేశంలో కరోనా విజృంభించిన సమయంలోనూ పరిశ్రమల్లో పనులు ఆగలేదు.
జీడిమెట్లలోని ప్యాకేజీ పరిశ్రమ
అప్పట్లో ఒకే షిఫ్టు.. నేడు మూడు షిఫ్టులు
రాష్ట్రం ఏర్పడే నాటికి నాణ్యమైన విద్యుత్తు సరఫరా లేకపోవడంవల్ల పరిశ్రమల్లో స్థాపిత సామర్థ్యంలో 20 శాతం మాత్రమే ఉత్పత్తులు జరిగేవి. నేడు పుష్కలమైన కరెంటు ఉండటంతో మూడు షిఫ్టుల్లో పనులు సాగుతున్నాయి. పవర్ బ్రేక్డౌన్లు, లో వోల్టేజీ వంటి సమస్యలు లేకపోవడంతో నిర్వహణ ఖర్చులు తగ్గిపోయాయి. దీంతో ఇప్పుడు మూడు షిఫ్టులు నడవడంతో ఉద్యోగుల సంఖ్య రెండు రెట్లు పెరిగింది. చెర్లపల్లిలోని హైటెక్ హైడ్రాలిక్ కంపెనీలో గతంలో ఒక షిఫ్టులో 50 మంది పనిచేస్తుండగా, ఇప్పుడు అదే కంపెనీలో మూడు షిఫ్టుల్లో 150 మంది పనిచేస్తుండటం విశేషం. ఇంచుమించు ఇదే తరహా పరిస్థితి ఇతర పరిశ్రమల్లోనూ ఉన్నది.
చెర్లపల్లిలోని కోరల్ ప్రింట్ ప్యాక్ పరిశ్రమ
భారీగా విద్యుత్తు వినియోగం
పరిశ్రమలు నిరంతరం నడుస్తుండటంతో విద్యుత్తు వినియోగం కూడా భారీగా పెరిగింది. కనెక్షన్లలోనూ భారీగా వృద్ధి నమోదైంది. పరిశ్రమల విద్యుత్తు వినియోగం 2015-16లో 11,363 మిలియన్ యూనిట్లు ఉండగా, 2021-22లో అది 15,076 మిలియన్ యూనిట్లకు పెరిగింది. 2022 అక్టోబర్ చివరినాటికి 9,716 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగం జరిగింది.
ఉద్యోగ భద్రత ఏర్పడింది
నేను రెండు దశాబ్దాలుగా చెర్లపల్లిలో వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న. గతంలో కరెంటు సరఫరా సరిగా లేక ఉద్యోగ భద్రత ఉండేదికాదు. ఎప్పుడు యజమాని పని మానేయమంటాడో అని నిత్యం భయపడేవాడిని. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కార్మికులు వేరే కంపెనీలకు వెళ్లకుండా యజమానులు జాగ్రత్త పడుతున్నారు. నైపుణ్యంగల కార్మికులు వెళ్లిపోతే పరిస్థితి ఏమిటని యజమానులు భయపడే పరిస్థితి వచ్చింది. ఇది పూర్తిగా సీఎం కేసీఆర్ ఘనతే.
– రాములు, ప్లాస్టిక్ ఇండస్ట్రీ, చెర్లపల్లి
నిరంతర విద్యుత్తు
మేము రెండు దశాబ్దాలుగా ఇక్కడ ఔషధ పరిశ్రమలకు అవసరమైన ఫైబర్ ప్రాసెస్ పరికరాలు తయారు చేస్తున్నాం. కరెంటు కోతలవల్ల గతంలో 20 శాతం ఉత్పత్తి జరిగితే గొప్ప. వచ్చిన ఆర్డర్లు కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు నిరంతరం నాణ్యమైన విద్యుత్తులో 100 శాతం ఉత్పత్తి జరుగుతున్నది. జనరేటర్ల వాడకం వల్ల 50 శాతం అధికంగా ఖర్చయ్యేది. ఇప్పుడు నిర్వహణ ఖర్చులు కూడా భారీగా తగ్గిపోయాయి. ఎనిమిదేండ్ల నుంచి అసలు కరెంటు కష్టాలంటే తెలియకుండా పోయింది.
– పీఆర్ఎస్ ప్రసాద్, యన్ప్లాస్ సంస్థ మేనేజర్, చెర్లపల్లి
పవర్ హాలిడేలు మర్చిపోయాం
గతంలో వారంలో మూడు రోజులు పవర్ హాలిడేలు, నాలుగు రోజులు రోజుకు నాలుగు గంటల మాత్రమే కరెంటు సరఫరా అయ్యేది. అందులో కూడా మధ్యమధ్యలో బ్రేక్డౌన్లు ఉండేవి. కరెంటుకోసం అనేకసార్లు ఇందిరాపార్క్ వద్ద ధర్నాలు చేశాం. ప్లాస్టిక్ ఇండస్ట్రీకి మిషన్ వేడెక్కడం ముఖ్యం. మిషన్ వేడెక్కేసరికి కరెంటు పోయేది. దీంతో ఉత్పత్తిలో తీవ్ర అంతరాయం ఎదురయ్యేది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కరెంటు కష్టాలు శాశ్వతంగా తీరాయి. ఇప్పుడు మూడు షిఫ్టుల్లో ఉత్పత్తి జరుగుతున్నది. జనరేటర్ మూలన పడింది. ఉద్యమ పార్టీ అధికారంలోకి రావడంతో పారిశ్రామిక రంగానికి పట్టిన దరిద్రం వదిలిపోయింది.
– పీ రామచంద్ర గౌడ్, త్రివేణి పాలిప్రింట్స్ చైర్మన్, చెర్లపల్లి
పండుగలకు వెళ్లేందుకు కూడా తీరకలేదు
ఔషధ కంపెనీలకు అవసరమైన రియాక్టర్లను సరఫరా చేస్తాం. తెలంగాణ రాక పూర్వం ఆర్డర్లు ఇచ్చేవారికి గడువులోగా ఏనాడూ సరఫరా చేయలేదు. పనిలేక ఎప్పుడూ ఖాళీగా కూర్చునేవాళ్లం. ఇప్పుడు కనీసం పండుగలకు ఊరికి వెళ్దామన్నా తీరిక దొరకటం లేదు. ఒక్క నిముషం కూడా పని ఆపకుండా మూడు షిఫ్టుల్లో చేస్తున్నాం. దేశంలో మరెక్కడా లేనివిధంగా తెలంగాణలో నాణ్యమైన విద్యుత్తు సరఫరా జరగడంవల్ల ఇతర రాష్ర్టాల్లోని పారిశ్రామికవేత్తలు కూడా ఇక్కడి ప్రభుత్వాన్ని ఎంతగానో ప్రశంసిస్తున్నారు.
– దౌలత్, మెట్రో ఇంజినీరింగ్ ఇండస్ట్రీ యజమాని, చెర్లపల్లి
ఉత్పత్తిలో నాణ్యత పెరిగింది
మేము గనులు, సిమెంటు పరిశ్రమలకు కన్వేయర్ మిషన్లను సరఫరా చేస్తాం. ఒమన్‌తోపాటు ఆఫ్రికన్ దేశాలకు కూడా ఎగుమతి చేస్తాం. రెండు దశాబ్దాలుగా ఈ వ్యాపారం చేస్తున్నప్పటికీ గడచిన ఎనిమిదేండ్లలో ఉన్న సంతృప్తి గతంలో లేదు. కరెంటు సమస్య వల్ల ఉత్పత్తి సాగేదికాదు. జనరేటర్లతో యంత్రాలు సరిగా పనిచేయక నిర్వహణ ఖర్చులు ఎక్కువగా ఉండేవి. ఆధునాతన జనరేటర్లను రూ.30 లక్షల పెట్టి కొనుగోలు చేశాం. అప్పుడే తెలంగాణ రావడం, కరెంటు కష్టా లు తొలిగిపోవటంతో ఇప్పుడు జనరేటర్‌తో పనిలేక వృధాగా పడి ఉన్నాయి. నిరంతర కరెంటు వల్ల ఉత్పత్తిలో నాణ్యత పెరగడమే కాకుండా ఇంధనం ఖర్చు రోజు కు రూ.15,000 నుంచి రూ.5000లకు తగ్గింది. ఇది పూర్తిగా కేసీఆర్ ఘనతే.
– రోషిరెడ్డి, హైటెక్ హైడ్రాలిక్ ఇంజినీర్స్ చైర్మన్, చెర్లపల్లి
ఎగుమతులు చేసే ధైర్యం వచ్చింది
కోల్‌మైన్స్, టాటా హిటాచీలు, బోర్ మిషన్లకు రిగ్‌లను సరఫరా చేస్తాం. కెన్యా సహా ఆఫ్రికా దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాం. గతంలో ఇతర దేశాల ఆర్డర్లకు కమిట్మెంట్ ఇచ్చేవాళ్లం కాదు. దీంతో చాలా ఆర్డర్లు క్యాన్సిల్ అయ్యేవి. గత ఎనిమిదేండ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కమిట్మెంట్ ప్రకారం ఎగుమతులు చేస్తున్నాం. మూడు షిఫ్టుల్లో పనులు నిరంతరాయంగా జరుగుతున్నాయి. కరెంటు కష్టాలను శాశ్వతంగా పరిష్కరించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కింది. ఉత్పత్తి, నిర్వహణ, ఇంధన వ్యయాలు తగ్గిపోయి పారిశ్రామిక రంగానికి ఎంతగానో మేలు జరిగింది.
– వెంకటేశ్వర్‌రెడ్డి, గణేశ్ రిగ్ ఇండస్ట్రీ యజమాని, చెర్లపల్లి
చేతినిండా పని
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత నిరంతర కరెంటు సరఫరా వల్ల చేతనైనవాడికి చేసుకొన్నంత పని దొరుకుతున్నది. చాలామంది రెండు షిఫ్టులు చేసుకొంటున్నారు. గతంలో పరిశ్రమలు నడవకపోవడంవల్ల ఎప్పుడూ నిండుగా వేతనం వచ్చేదికాదు. కరెంటు కష్టాలవల్ల యజమానులు నష్టపోయి కార్మికులకు కూడా అరకొరగా వేతనాలు ఇచ్చేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సీఎం కేసీఆర్ చొరవతో పరిశ్రమల పరిస్థితి ఉజ్వలంగా మారింది. హైదరాబాద్‌లోని పరిశ్రమలన్నీ నిరంతరాయంగా ఉత్పత్తి చేస్తున్నాయి. దీనివల్ల ముఖ్యంగా నైపుణ్యం ఉన్న కార్మికులకు డిమాండ్ ఏర్పడింది. వాళ్లని కాపాడుకొనేందుకు యాజమాన్యాలు కృషిచేస్తున్నాయి.
– త్రినాథ్, క్వాలిటీ మేనేజర్, యన్ప్లాస్ ప్రై.లి. చెర్లపల్లి