జోగులాంబ గద్వాల : కాంగ్రెస్ ప్రభుత్వం దసరాకు ముందే రైతుల ఖాతాలో రైతు భరోసా(Rythu bharosa) జమ చేస్తామని చెప్పి నేటి వరకు రైతుల ఖాతాలో రైతు భరోసా జమ చేయకపోవడం దారుణమని నడిగడ్డ హక్కుల పోరాట సమితి చైర్మన్ గొంగల రంజిత్ కుమార్(Ranjith Kumar) అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో 200 మంది రైతులతో(Farmers) కలసి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నకు దిగారు. ఈ సందర్భంగా రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. రైతులకు 2 లక్షల రుణమాఫీ మాటలకే పరిమితం అయిందని విమర్శించారు.
రైతుల సమస్యను వినడానికి అనుమతి ఇవ్వని కలెక్టర్, పోలీసులకు రైతుల బాధలు అర్థం కావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సమస్యలు వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్‌ను డిమాండ్ చేశారు. బిజ్వరం గ్రామంలో బాలిక చనిపోతే పోలీసు పహారా మధ్య అంత్యక్రియలు చేసేలా కృషి చేసిన యంత్రాంగం, అన్నం పెట్టే రైతన్నను కలెక్టర్ గేటు ముందే పోలీసులు నిర్బంధించడం కాంగ్రెస్ ప్రజాపాలనకు అద్దం పడుతుందని ఎద్దేవా చేశారు. వెంటనే రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.