రంగారెడ్డి, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ)/ఇబ్రహీంపట్నం : సంచలనంగా మారిన ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రోజుకో మలుపు తిరుగుతున్నది. ఇప్పటికే చైర్మన్ ఎన్నిక రెండుసార్లు వాయిదాపడింది. బీఆర్ఎస్ 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి మిగతా సభ్యులతో కలిసి క్యాంపునకు వెళ్లారు. కాని, కాంగ్రెస్ నాయకుల ప్రలోభాలకు తలొగ్గి ఆయన కుమారుడు, భార్య తన తండ్రిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అంతటితో ఆగకుండా తన తండ్రి లేకుండా ఎన్నిక జరుపవద్దని హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ స్వీకరించిన హైకోర్టు ఇబ్రహీంపట్నం ఎన్నికపై స్టే ఇచ్చింది. వెంటనే చైర్మన్ ఎన్నిక నిలిపివేసి యాదగిరిని కోర్టులో హాజరుపర్చాలని ఇబ్రహీంపట్నం పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. అనూహ్య రీతిలో యాదగిరి బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి మంగళవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం కొనసాగుతుండగానే ఎన్నికలు నిలిపివేశారు.యాదగిరిని పోలీసులు అదుపులోకి తీసుకుని బుధవారం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు.
మభ్యపెట్టి.. మార్చేశారు
మూడు పర్యాయాలుగా మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి వెన్నంటే ఉన్న ఆకుల యాదగిరి అనారోగ్యం రీత్యా సోమవారం జరిగిన చైర్మన్ ఎన్నికకు హాజరు కాలేకపోయాడు. అనంతరం మంగళవారం జరిగిన సమావేశానికి హాజరై బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థికి మద్దతు తెలపడంతోపాటు ఎన్నిక అనంతరం బయటకు వచ్చిన యాదగిరి మీడియాతో కూడా తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదు. తాను క్షేమంగానే ఉన్నాను. బీఆర్ఎస్కు మద్దతుగానే ఉన్నానంటూ తెలిపిన యాదగిరిని, ఆయన కుమారుడు హైకోర్టులో వేసిన పిటిషన్ ద్వారా పోలీసులు కస్టడీలోకి తీసుకొని ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచారు.
యాదగిరి పోలీస్‌స్టేషన్‌లో ఉన్న సమయంలో కాంగ్రెస్ నాయకులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఆయనను మభ్యపెట్టడంతోపాటు ఎమ్మెల్యే రంగారెడ్డితో ఫోన్ ద్వారా మాట్లాడించారు. ఈ నేపథ్యంలో బుధవారం కోర్టులో న్యాయమూర్తి ఎదుట తనను మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి.. ఆయన తండ్రి కిషన్‌రెడ్డి బలవంతంగా చీరాల బీచ్‌కు తీసుకెళ్లి రూంలో బంధించారని.. తన భార్య, కుమారుడు వచ్చినా కలువనివ్వలేదని న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో యాదగిరి స్టేట్మెంట్ రికార్డు చేసిన న్యాయమూర్తి ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికపై ఉన్న స్టేను ఎత్తివేశారు. తదుపరి నిర్ణయం ఎన్నికల రిటర్నింగ్ అధికారి తీసుకుంటారని తెలియజేశారు. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా యాదగిరి మాట్లాడటం ఇబ్రహీంపట్నంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వెంచర్ల పేరుతో బెదిరింపులు
ఇబ్రహీంపట్నంకు సంబంధం లేని గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి స్వయంగా యాదగిరితో ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో మాట్లాడి.. ఎమ్మెల్యేతో మాట్లాడించి బెదిరింపులకు పాల్పడి తమకు అనుకూలంగా మార్చుకోవటంతోనే మాటమార్చినట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇబ్రహీంపట్నంమున్సిపాలిటీలో గత రెండు పర్యాయాలుగా కౌన్సిలర్‌గా గెలుపొందిన ఆకుల యాదగిరి, ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ 6 ఓట్లతో గెలుపొందారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లతో క్యాంపులో ఉన్న ఆకుల యాదగిరి తనకు చైర్మన్ పదవి కావాలని కోరడంతో అవకాశం లేనందున.. ఇదే అదునుగా భావించిన మల్రెడ్డి రంగారెడ్డి ఆకుల యాదగిరిని తమవైపు తిప్పుకొనేందుకు సర్వ ప్రయత్నాలు చేశారు.
యాదగిరి కుమారుడు, భార్యతో సోమవారం మున్సిపల్ కార్యాలయంలో గొడవకు ఉసిగొల్పడంతోపాటు మంగళవారం జరిగే ఎన్నికను అడ్డుకునేందుకు యాదగిరి కుమారుడితో హైకోర్టులో పిటిషన్ వేయించారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు మంగళవారం ఎన్నిక వాయిదా పడింది. ఇదే అదునుగా భావించిన రంగారెడ్డి యాదగిరిని తమవైపు తిప్పుకొనేందుకు పోలీసు కస్టడీలో ఉన్న యాదగిరి దగ్గరకు కాంగ్రెస్ నాయకులను పంపించి.. వారి ద్వారా ఫోన్లో మాట్లాడి బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. గతంలో యాదగిరి చేసిన వెంచర్లలో ఉన్న లొసుగులను బయటకు తీస్తానని.. తమకు రూ.కోటి ముట్టజెప్పాలని లేదంటే.. కాంగ్రెస్‌కు అనుకూలంగా మారాలని బెదిరింపులకు పాల్పడటంతో యాదగిరి చేసేదేమీలేక కాంగ్రెస్‌కు అనుకూలంగా కోర్టులో చెప్పినట్లు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నా.. బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన కౌన్సిలర్లను అక్రమంగా తమవైపు తిప్పుకొనేందుకు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సర్వశక్తులొడ్డుతున్నారు. ప్రజాస్వామ్యయుతంగా గెలిచే దమ్ములేక అడ్డదారిలో ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కైసవం చేసుకునేందుకు ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నాలన్నీ శూన్యమయ్యాయి. 13 స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని అధఃపాతాళానికి తొక్కింది. 19వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున గెలుపొందిన యాదగిరిని అడ్డం పెట్టుకుని అనవసర రాద్దాంతాలకు తెరలేపి ఆయనను తమవైపు తిప్పుకొనేందుకు చేసిన ప్రయత్నంపై కోర్టు కాంగ్రెస్‌కు విరుద్ధంగా తీర్పు ఇచ్చింది. ఇప్పటికైనా రంగారెడ్డి చిల్లర రాజకీయాలు మానుకుని ప్రజలిచ్చిన తీర్పుకు శిరసావహించాలి.
యాదగిరి బీఆర్ఎస్ బీఫాం ద్వారా బీఆర్ఎస్ సింబల్ నుంచి గెలుపొందినప్పటికీ ఆయన అనారోగ్య రీత్యా ఎన్నికకు హాజరుకాలేదన్న సాకుతో సోమవారం ఎన్నిక నిలిపివేసేందుకు కాంగ్రెస్ కౌన్సిలర్లతోపాటు ఎమ్మెల్యే రంగారెడ్డి అనేక కుట్రలు చేశారు. మంగళవారం కూడా ఎన్నిక జరపాల్సి ఉన్పప్పటికీ ఎన్నిక జరుపకుండా కోర్టు స్టే వచ్చిందని కేవలం ఫోన్ కాల్ ద్వారానే ఎన్నికను నిలిపివేయడం సిగ్గుచేటు. మంగళవారం యాదగిరి మున్సిపల్ కార్యాలయంలో సమావేశానికి హాజరైనప్పటికీ ఎన్నికల అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారి చైర్మన్ ఎన్నికను నిలిపివేయడం హేయమైన చర్య. ఎన్ని కుట్రలు చేసినా ఇబ్రహీంపట్నంలో చైర్మన్ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఖాయం.