మీరు ఏది కోరుకుంటే దాన్ని నెరవేర్చే ‘అల్లావుద్దీన్ అద్భుత దీపం’ గురించి వినే ఉంటారు కదా? ఇప్పుడు టెక్ ప్రపంచంలో అలాంటి ఓ మ్యాజిక్‌నే నిజం చేయబోతున్నది గూగుల్. అవును.. సుందర్ పిచాయ్ ఇటీవల ప్రకటించిన ‘ప్రాజెక్ట్ జెనీ’ ఇప్పుడు ఇంటర్నెట్ లోకంలో ప్రకంపనలు సృష్టిస్తున్నది.
‘ఇది ఈ లోకానికి చెందని టెక్నాలజీ’ అని గూగుల్ సీఈవో వర్ణించారంటే.. మనం ఊహించే ఏఐ కంటే ఇది ఎన్నిరెట్లు పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నదో అర్థం చేసుకోవచ్చు. అసిస్టెంట్ నుంచి అడ్వైజర్ వరకు.. మీ ప్రతి అవసరాన్ని ముందే పసిగట్టేస్తుందట ఈ సరికొత్త ‘డిజిటల్ జెనీ’. ఇప్పటివరకూ చూసిన చాట్బాట్లు మనం అడిగిన దానికి మాత్రమే సమాధానం ఇస్తాయి. కానీ ‘ప్రాజెక్ట్ జెనీ’ అలా కాదు. ఇది మీ అవసరాలను, మీ ఆలోచనలను ముందే పసిగట్టే.. ఓ ‘ప్రోయాక్టివ్ ఏఐ’.
ఇది కేవలం టెక్ట్స్ మాత్రమే కాదు.. మీరు చూస్తున్నది, వింటున్నది.. అంతేకాదు.. మీ చుట్టూ ఉండే పరిసరాలను కూడా అర్థం చేసుకుంటుంది. మీరు ఏదైనా పనిలో ఇబ్బంది పడుతుంటే.. మీరు అడగకముందే ‘నేను సహాయం చేయనా?’ అని అడుగుతుంది. అందుకే దీన్ని గూగుల్ తన అత్యంత శక్తిమంతమైన ఏఐ మోడల్‌గా పేర్కొంటున్నది. సుందర్ పిచాయ్ దీన్ని అంతలా పొగడటానికీ ఓ కారణం ఉంది. ఇది కేవలం సాఫ్ట్వేర్ మాత్రమే కాదు.
మన దైనందిన జీవితంలో ఓ భాగం కాబోతున్నది. మనిషికి, యంత్రానికి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించే ఓ అద్భుత వంతెన ఇది. మనిషి టెక్నాలజీని వాడే విధానాన్నే పూర్తిగా మార్చేయబోతున్నది. మీ ఫోన్, ల్యాప్‌టాప్, చివరికి మీ ఇంటి స్మార్ట్ డివైజ్లతో అనుసంధానమై.. ఓ అదృశ్య నేస్తంలా మీకు తోడుగా ఉంటుంది. మీరు బిజీగా ఉన్నప్పుడు మీ మెయిల్స్ షెడ్యూల్ చేయడం మొదలుకొని, మీ మూడ్‌ను బట్టి మ్యూజిక్ ప్లే చేయడం వరకూ అన్నీ ఈ ‘జెనీ’నే చూసుకుంటుంది.
ఏఐలో మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ వంటి దిగ్గజాలు పోటీ పడుతున్న తరుణంలో.. ‘ప్రాజెక్ట్ జెనీ’తో గూగుల్ తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని చూస్తున్నది. ఇందులో వాడిన అల్గారిథమ్స్ మునుపెన్నడూ లేనివిధంగా అత్యంత వేగంగా డేటాను ప్రాసెస్ చేస్తాయి. కేవలం ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాదు.. క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలనూ సూచిస్తుంది.
ఈ ప్రాజెక్ట్ మన చేతుల్లోకి వస్తే.. ‘స్మార్ట్ లైఫ్’ అనే పదానికి కొత్త నిర్వచనం లభిస్తుందనడంలో సందేహం లేదు. టెక్నాలజీ మన ఊహల కంటే వేగంగా దూసుకెళ్తున్నది. అల్లావుద్దీన్ దీపంలోని జెనీ.. కేవలం మూడు కోరికలే తీరుస్తుంది. గూగుల్ ‘జెనీ’ మాత్రం.. మన డిజిటల్ ప్రపంచంలో మరెన్నో అద్భుతాలు చేస్తుంది. వాటిని ప్రత్యక్షంగా చూడాలంటే.. కొన్ని రోజులు వేచి చూడాల్సిందే!