వనస్థలిపురం, ఫిబ్రవరి 18 : తనకు విడాకులిచ్చి, పాస్‌పోర్టును సస్పెండ్ చేయించి, రెండవ వివాహం చేసుకున్న మాజీ భార్యపై కక్షకట్టి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. మంథనికి చెందిన ఉడుకుల మహేశ్(35)కు మహారాష్ట్ర బల్లాల్పూర్కు చెందిన భూదార్తి రాజేశ్ కుమార్తె సునీత(30)కు 2021లో వివాహం జరిగింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య సఖ్యత కుదరకపోవడంతో 2022లో బల్లాల్పూర్ పోలీస్ స్టేషన్లో సునీత.. మహేశ్‌పై కేసు పెట్టింది.
ఆ కేసు విచారణ పూర్తై 2024లో విడాకు లు మంజూరయ్యాయి. అనంతరం 2025లో సనీత శ్రీనాథ్ అనే వ్యక్తిని రెండవ వివాహం చేసుకుని వనస్థలిపురంలోని గ్రీన్ సిటీ కాలనీలో ఉన్న కేఎన్ఆర్ మెడోస్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటూ నగరంలోని డెలాయిట్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. కాగా అంతకు ముందు కెనడాలో ఉంటున్న మహేశ్ కేసు హియరింగ్ కోసం నగరానికి వచ్చాడు. అనంతరం సునీ త.. అతని పాస్‌పోర్టును సస్పెండ్ చేయించడంతో ఇక్కడే ఉండి పోయాడు. అతడి తల్లికూడా ఇటీవలే మృతి చెందింది. తన పాస్ పోర్టు సస్పెండ్ కావడం, ఉద్యోగం లేకపోవడం, తల్లి కూడా తను పడుతున్న ఇబ్బందులు చూసి తట్టుకోలేక చనిపోయిందని భావించి సునీతపై విపరీతంగా కక్ష పెంచుకున్నాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు చూసి….
పగతో రగిలిపోతున్న మహేశ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో సునీత ఫొటోలు, వీడియోలు కనిపించాయి. ఆమె మరో వివాహం చేసుకుని, వనస్థలిపురంలో సంతోషంగా ఉన్నట్లు వీడియోల ద్వారా తెలుసుకున్నాడు. ఏలాగైనా ఆమెను మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. అందుకు కావాల్సిన కిట్ బ్యాగును సిద్ధం చేసుకున్నాడు. ఒక నెల రోజులుగా అపార్ట్మెంట్ పరిసరాలకు వచ్చి రెక్కీ నిర్వహించాడు. ప్లాట్ నంబర్, ఆమె ఇంట్లో ఉండే సమయాన్ని తెలుసుకున్నాడు. హత్య చేసేందుకు బుధవారం మధ్యా హ్నం సమయాన్ని ఎంచుకుని అక్కడికి చేరుకున్నాడు. అపార్ట్మెంట్లోని ఫ్లాట్ వద్దకు వెళ్లగా మెయిన్ డోర్ తెరిచి ఉంది. సునీత బెడ్రూంలో ఉం ది. నేరుగా బెడ్రూంలోకి వెళ్లిన నిందితుడు వెంటనే తలుపు గడియ పెట్టేశాడు. అరిస్తే పెట్రోల్ పోసి తగలబెడతానని బెదిరించాడు.
అయినా సరే ఆమె అరవడంతో వెంట తెచ్చుకున్న కత్తితో కడుపులో, వెన్నుపై పొడిచాడు. ఆమె పారిపోవడానికి తలుపు వద్దకు వెళ్లగా వెనుక నుంచి కొబ్బరి బొండాల కత్తితో తలపై నరికాడు. దీంతో ఆమె అక్కడే కుప్పకూలి పోయింది. ఆమె అరుపులు విని పక్క గదిలో ఉన్న శ్రీధర్ సోదరుడు సాయి తలుపును కొట్టాడు. ఇరుగు పొరుగువారు అక్కడికి వెళ్లి తలుపు తెరిచేందుకు ప్రయత్నించారు. పోలీసులు వస్తేనే తలుపు తీస్తానని, లేదంటే పెట్రోల్‌తో అపార్ట్మెంట్ మొత్తం తగలబెడతానని బెదిరించాడు. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి వచ్చిన పోలీసులు తలుపు తీయాలని చెప్పగా అతడు ఒప్పుకోలేదు. దీంతో పోలీసులు బెడ్రూం తలుపును బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. దీంతో నిందితుడు బాత్రూంలోకి వెళ్లి గడియ వేసుకున్నాడు. పోలీసులు దాదాపు అరగంటసేపు అతడితో మాట్లాడి బయటకు రప్పించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కలకలం రేపుతున్న కిట్ బ్యాగు…
నిందితుడితోపాటు దొరికిన కిట్ బ్యాగు కలకలం రేపుతోంది. ఒక మనిషికి ఇంత క్రూరత్వం ఉంటుందా అని అనిపిస్తోంది. అందులో ఉన్న సామాన్లు చూస్తే.. చెట్లను కత్తిరించే ఎలక్ట్రిక్ రంపం, చువ్వలను కట్ చేసే కటింగ్ మిషన్, రెండు చాకులు, కొబ్బరి బొండాల కత్తి, సుత్తె, స్క్రూడ్రైవర్, మాస్కులు, చేతి గ్లౌజులు, కొన్ని బట్టలు అందులో ఉన్నాయి. వీటన్నింటితో ఎంత క్రూరంగా హత్య చేసేందుకు ప్లాన్ చేశాడో తెలుస్తోంది. మృతురాలు 3నెలల గర్భవతిగా ఉన్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వనస్థలిపురం ఎస్ఐ రవినాయక్ తెలిపారు. ఘటనా స్థలాన్ని వనస్థలిపురం ఏసీపీ, ఎల్బీనగర్ డీసీపీ, క్లూస్ టీమ్‌లు పరిశీలించారు.