దుందుభీని ఇసుక దొంగలు కొల్లగొట్టేస్తున్నారు.. మాటేసి నదీ గర్భాన్ని కుళ్లబొడుస్తోన్నారు.. హిటాచీలు పెట్టి రాత్రింబవళ్లు దోచేస్తున్నారు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కలిసి ఇసుక మాఫియా అవతారమెత్తారు. ఉప్పునుంతల, తెలకపల్లి మండలాల్లో పారుతున్న వాగులో ప్రభుత్వ పనుల పేరుతో బరితెగించి తవ్వకాలు జరుపుతున్నారు. తర్వాత టిప్పర్లలో తరలించి ప్రైవేటుగా విక్రయిస్తూ దర్జాగా దందా కొనసాగిస్తున్నారు.. అడ్డుకుంటే మీ సంగతి చూస్తామని హెచ్చరిస్తున్నారు.. యథేచ్ఛగా రవాణా చేస్తూ ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లు గండికొడుతున్నారు. వారి వ్యాపారం ‘మూడు పువ్వులు- ఆరు కాయలు’గా విరాజిల్లుతోంది.. ఓ ఎమ్మెల్యే అనుచరుడే చక్రం తిప్పుతున్నాడన్న గుసగుసలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా అరికట్టాల్సిన మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కలిసి ఇసుక మాఫియా అవతారం ఎత్తారు. ప్రభుత్వ పనుల పేరుతో తమ అనుచరులను ముందు పెట్టి దుందుభీ నదిని తోడేస్తున్నారు. అడ్డొచ్చిన వాళ్లను మీ సంగతి చూస్తామంటూ బెదిరిస్తున్నారు. దీపమున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలని చందంగా మళ్లీ గెలుస్తామో లేదో అని ప్రభుత్వ ఖజానాకు నయా పైసా రాకుండా కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. వీళ్ల ఇసుక దాహానికి ఆ జిల్లాలో వాగులు వంకలు అన్నీ ఖాళీ అయి పోతున్నాయి. అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకి భయపడి అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు.
ఇక పోలీసు యంత్రా ంగం ఇసుక టిప్పర్లను ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరేలాగా సహకరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇక మై నింగ్శాఖ మొద్దు నిద్రలో ఉన్న ది. జిల్లా ఉన్నతాధికారుల కు తెలియకుండా ఓ తాసీల్దార్ ఇచ్చిన ఆర్డర్ కాపీని అడ్డం పెట్టుకొని దుందుభీ నుంచి ఇసుకను దోచేస్తున్నారు. ఆ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు దగ్గరుండి నడిపిస్తున్నారు. ఈ జిల్లాలో కొంతమంది తాసీల్దార్లకు పోస్టింగులు ఇప్పించారు. ఇంకేముంది ఆయా తాసీల్దార్లు ఇతని ఆర్డర్ రాగానే నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు టకటక ఇచ్చేస్తున్నారు. ఎందుకు ఏమిటీ అని విచారించకుండా కనీసం జిల్లా ఉన్నతాధికారులకు కూడా సమాచారం లేకుండా ఇసుక దందా నడుస్తోంది.
ఓ ప్రజాప్రతినిధి సొంత గ్రామానికి చెందిన ఇసుక మాఫియా లీడర్ ద్వారా ఇసుక రవాణా జరుగుతున్నది. ఎవరైనా అడ్డుకుంటే క్షణాల్లో ఆ ఎమ్మెల్యేల నుంచి ఫోన్లు వస్తాయి. మా వాళ్లు ఇసుక కొడుతుంటే అడ్డుకుంటారా మీ సంగతి చూస్తామంటూ బెదిరిస్తుండడంతో వాగు పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల నేతలు, ప్రజలు వణికిపోతున్నారు. పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అండదండలు ఉండడంతో అనుమతుల పేరుతో జరుగుతున్న ఇసుక దందా గురించి పెదవి విప్పడం లేదు.
అంతేకాకుండా టిప్పర్ల ద్వారా రాత్రి పగలు తేడా లేకుండా తిరుగుతుండడంతో రోడ్లన్నీ గుంతమయమవుతున్నాయి. ఇదంతా సాక్షాత్తు సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలోనే ఆయన స్వగ్రామం దగ్గర్లోనే ఈ వ్యవహారం నడుస్తున్నది. అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇసుక దందాపై బుధవారం ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధి బృందం ఇసుక తరలిస్తున్న దుందుభీ నది వద్దకు వెళితే రెండు పెద్ద పెద్ద హిటాచిలతో 10, 15 టిప్పర్ల ద్వారా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న దృశ్యాలు కనిపించాయి.

ఎమ్మెల్యేలకు కాసులు కురిపిస్తున్న దందా..
నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రభుత్వ పనులకు తరలిస్తున్నామని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు ఇసుక దందాకు తెర లేపారు. గత కొన్నాళ్లుగా జరుగుతున్న ఇసుక దందాపై ఎవరైనా అడ్డుకుంటే సదరు ప్రజాప్రతినిధుల నుంచి బెదిరింపులు రావడంతో హడలెత్తిపోతున్నారు. ఇక నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పనులకంటూ తెలకపల్లి, ఉప్పునుంతల మండలాల్లోని దుందుభీ వాగులో ఇసుకను తోడేస్తున్నారు. వాస్తవంగా ఎక్కడ కూడా ప్రభుత్వ పనులు జరుగుతున్నట్లు దాఖలాలు లేవు. అక్కడక్కడ సీసీ రోడ్లు మాత్రమే వేస్తున్నారు. భారీ నిర్మాణాలు ఎక్కడా ప్రారంభం కాలేదు. మరి ఈ వాగుల నుంచి కొడుతున్న ఇసుక ఎక్కడికి వెళుతుంది? అడ్డుకుంటే ఎ మ్మెల్యేలు ఎందుకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు? ఉన్నతాధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నా రు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.
చక్రం తిప్పుతున్న ఓ ఎమ్మెల్యే అనుచరుడు
నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఓ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు ఇసుక దందాలో చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. ఏ ఎమ్మెల్యేకు ఎంత వాటా ఇవ్వాలో సదరు నాయకుడే పువ్వుల్లో పెట్టి పంపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. నాగర్‌కర్నూల్, అచ్చంపేట నియోజకవర్గాల్లో చాలా మండలాల్లోని తాసీల్దార్లు సదరు నాయకుడు పోస్టింగులు ఇప్పించారు. దీంతో ఆయా తాసీల్దార్లు ఇతని ఆర్డర్ రాగానే జిల్లా ఉన్నతాధికారులకు తెలియకుండా అనుమతులను జారీ చేస్తున్నారు.
అనుమతులన్నీ బోగస్..
నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఉప్పునుంతల మండలం దాసరపల్లి గ్రామంలో దుందుభీ వాగు నుంచి గత 15 రోజులుగా రెండు హిటాచీలు పెట్టి రోజుకు 100 ట్రిప్పులు టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. ఈ మండల తాసీల్దార్ ఇచ్చిన ఆర్డర్ కాపీలో మాత్రం ఏ ప్రభుత్వ వర్క్ అనేది ఎక్కడా లేదు.. కేవలం నాగర్‌కర్నూల్‌కు తరలిస్తున్నట్లు మాత్రమే ఇచ్చి.. టిప్పర్ల నెంబర్లు మెన్షన్ చేస్తున్నారు. వాస్తవంగా ఈ ఆర్డర్లో ఉన్నది చూస్తే ఇదంతా బోగస్ అని తెలుస్తోంది. అనుమతిలో ఇచ్చిన టిప్పర్ల నెంబర్లు అక్కడ నడుస్తున్న టిప్పర్ల నెంబర్లు వేరువేరుగా ఉన్నాయి.
అంటే కావాలని అనుమతులు ఉన్నట్లు నమ్మించి ఇసుక దోపిడీకి పాల్పడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. వాస్తవంగా ఇసుక ప్రభుత్వ పనులకు ఇవ్వాలంటే సదరు డిపార్ట్మెంట్ నుంచి కలెక్టర్‌కు ఒక లేఖ రాయాలి. కలెక్టర్ ఆ లేఖను ఉటంకిస్తూ సంబంధిత తాసీల్దార్‌కు ఫలానా పనులకు సంబంధించి ఎన్ని క్యూబిక్ మీటర్ల ఇసుక కావాలో ఆర్డర్ పెడుతూ దానికి సంబంధించి ప్రభుత్వ ఖజానాకు టన్నుకు ఇంత చొప్పున రేటు పెట్టి అది కట్టిన తర్వాతనే ప్రొసీడింగ్ ఇస్తారు. సదరు కాంట్రాక్టర్లు ఈ ప్రొసీడింగ్ పట్టుకొని ఇసుకను తీసుకెళ్తారు. కానీ ఇక్కడ అవేవీ లేవు. కేవలం ఒక ఆర్డర్ కాపీని తీసుకొని దాన్ని జిరాక్స్ తీసి రోజు డేట్లు మారుస్తూ అనుమతులు ఉన్నాయని గ్రామస్తులకు చెబుతూ ఇసుక దందాకు తెర లేపారు.
అడ్డుకుంటే ఇక అంతే సంగతులు
నాగర్‌కర్నూల్ జిల్లాలోనీ అచ్చంపేట, నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో గత కొన్నాళ్లుగా ఇసుక దందా నడుస్తోంది. తెలకపల్లి, ఉ ప్పునుంతల మండలాల్లో దుందుభీ వాగు ప్రవహిస్తుంది. అంతేకాకుండా చిన్నచిన్న వాగులు కూడా ఉన్నాయి. ఈ వాగుల నుంచి ఇసుక ను ఇటు హైదరాబాద్ అటు నాగర్‌కర్నూల్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు అనుమతులు ఉన్నాయని వాగు పరివాహ ప్రాంతాల గ్రామాలకు ప్రజలను నమ్మిస్తున్నారు. భూగర్భ జలాలు పడిపోతాయని.. మా బోర్లు ఎండిపోతున్నాయని ఫిర్యాదులు చేస్తే వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారు.
నేరుగా ఎమ్మెల్యేలే ఫోన్లు చేసి బెదిరిస్తున్నారంటే ఈ జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు. ప్రస్తుతం దుందుభీ నదిలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న ప్రదేశం సాక్షాత్తు సీఎం స్వగ్రామానికి కూతవేటు దూరం లో ఉంటుంది. అయినా అధికార పార్టీ అండదండలతో జరుగుతున్న ఇసుక దోపిడీపై ఉన్నతాధికారులు కూడా మౌనం వహించారు. ఎవరైనా అడ్డుకుంటే వెంటనే బదిలీలు బహుమానంగా వస్తున్నాయి. మరోవైపు తమకు కావలసిన వారికి తాసీల్దార్లుగా పోస్టింగ్‌లు ఇప్పించి అక్రమ రవాణాకు తెరలేపారు.
ఇక పోలీసు యంత్రాంగం ఫలానా వాగు నుంచి ఇసుక టిప్పర్లు బయలుదేరితే ఎవరు అడ్డుకోకుండా అడ్డుకుంటే అక్కడికక్కడే సెటిల్ చేసి ఎక్కడికి పంపాలో అక్కడికి దగ్గరుండి పంపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ కోట్ల రూపాయలకు పడగలెత్తుతున్న ఎమ్మెల్యేల ఇసుక దందాపై సొంత పార్టీలోనే విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మేల్కొని నాగర్‌కర్నూల్ జిల్లాలో జరుగుతున్న ఇసుక దోపిడీని అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.