సిటీ బ్యూరో, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడుతున్నది. నిత్యం వందలామంది జిల్లా ప్రజలు, ఉద్యోగులు, సిబ్బంది కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చి వెళ్తుంటారు. వారికి కనీస సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. లిఫ్టులు తరచూ మరమ్మతులకు గురవడంతో ఎప్పుడు పనిచేస్తుందో చెప్పలేని పరిస్థితి. ఐదుఫ్లోర్లున్న భవనంలో మెట్ల ద్వారా పైకెక్కి కిందికి దిగేందుకు వృద్ధులు, దివ్యాంగులు, సీనియర్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.
కలెక్టర్ భవనం, స్నేహ సిల్వర్ జూబ్లీ భవనం రెండింట్లో మరుగుదొడ్ల నిర్వహణ అధ్వాన్నంగా తయారైంది. వాటిని శుభ్రం చేయకపోవడంతో కంపు కొడుతున్నాయి. దీనికితోడు తాగునీటి సౌకర్యం లేకపోవడంతో వివిధ పనుల కోసం వచ్చిన వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా ప్రతి సోమవారం ప్రజావాణిలో తమ సమస్యలను విన్నవించేందుకు వందలాది మంది జిల్లా ప్రజలు కలెక్టరేట్‌కు వస్తుంటారు. కలెక్టరేట్లో సరైన సౌకర్యాలు లేక వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
దివ్యాంగులు, వృద్ధులకు తప్పని తిప్పలు
కలెక్టరేట్లోని రెండు భవనాల లిఫ్టులు సరిగ్గా పనిచేయకపోవడంతో.. వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన దివ్యాంగులు, వృద్ధులు మెట్ల ద్వారా అధికారుల కార్యాలయాలకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. ఆరోగ్య సమస్యలున్న సీనియర్ ఉద్యోగులు సైతం మెట్లద్వారా వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కలెక్టరేట్ ఆవరణలోని స్నేహ సిల్వర్ జూబ్లీ భవనంలో జిల్లా సంక్షేమ కార్యాలయాలు, రెవెన్యూ సర్వే రికార్డుల కార్యాలయం, పౌర సరఫరాల కార్యాలయం, ఆరోగ్య శ్రీ వంటి విభాగాలు ఉంటాయి. ఈ భవనంలో రెండు లిఫ్టులు ఉండగా ఒకటి మాత్రమే అందుబాటులో ఉంది. అది కూడా సరిగ్గా పనిచేయక దాదాపు 3 నెలలు దాటిపోయింది.
లిఫ్ట్‌లో ఇరుక్కున్న ఉద్యోగులు..
తాజాగా సోమవారం 1వ ఫ్లోర్ దాటిన తర్వాత లిఫ్టు అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో ఐదుగురు సిబ్బంది గంటకుపైగా అందులోనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడిపారు. ఎట్టకేలకు టెక్నికల్ సిబ్బంది లిఫ్ట్‌కు మరమ్మతుల చేపట్టి వారిని బయటకు తీసుకువచ్చారు. జిల్లా మొత్తానికి తలమానికంగా ఉండే కలెక్టరేట్ నిర్వహణనే ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతన్నాయి. ఇప్పటికైనా కలెక్టరేట్ భవన నిర్వహణను సక్రమంగా చేపట్టి ప్రజలు, ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు.