కర్షక దేశమైన మన భరత జాతి ఏకైక ఆకాంక్ష.. సుజలాం.. సుఫలాం.. సస్యశ్యామలాం. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో దాన్ని సాకారం చేసిన ధీరుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. తెలంగాణ ఆవిర్భావానంతరం తొమ్మిదిన్నరేండ్ల పాలనలో రెప్పపాటు కోతలు లేని కరెంటుతో రాష్ర్టాన్ని వెలుగుల దివ్వెగా మార్చారు. సాగునీటి ప్రాజెక్టులతో తెలంగాణను సుజలం చేశారు. కేసీఆర్ దూరదృష్టితో దేశానికే అన్నంపెట్టే తల్లిగా సుఫలమైన తెలంగాణ.. సాగుభూమి వృద్ధిలో సస్యశ్యామల గడ్డగా అవతరించింది. బీఆర్ఎస్ ఏలుబడిలో సాగు పండుగవ్వడంతో అన్నదాత ముఖాలు చిరునవ్వుతో తొణికిసలాడాయి. దిగుబడులు పెరిగి కీసల నిండా పైసల గలగలలు వినిపించాయి.వలసలు, ఆత్మహత్యలు అనే మాటలే వినిపించకుండా పోయాయి.
కేసీఆర్ స్వర్ణయుగంలో వెక్కిరించిన ఆంధ్రోళ్లనే వెనక్కి నెట్టిన తెలంగాణ ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంలో మళ్లీ తెర్లయిపోయింది. ఉమ్మడిపాలనలో ఎదుర్కొన్న చీకటి రోజులు మళ్లీ ముంచుకొచ్చాయి. కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన రోజు నుంచే రాష్ర్టానికి కానికాలం, కష్టకాలం దాపురించింది. కరెంటు కోతలతో కాపుకొచ్చిన పంట ఎండిపోవడాన్ని చూడలేక సమస్త రైతాంగం ప్రతీ దినం కన్నీటి శిస్తును చెల్లిస్తున్నది. అప్పులే పెట్టుబడిగా, కన్నీళ్లే దిగుబడిగా.. దిగాలుపడ్డ రైతన్న ఎండిన పొలంలోనే కూలబడుతున్నాడు. తొమ్మిదిన్నరేండ్లు రెప్పపాటైనా పోని కరెంటు.. ఇప్పుడు మళ్లీ అరిగోస పుచ్చుకొంటున్నది. అడుగంటిన బోర్లు.. కాలుతున్న మోటర్లు.. గుంటెడు భూమిని తడిపేందుకు పొలాల్లోకి ట్యాంకర్లు.. వెరసి తెలంగాణ రైతాంగం మళ్లీ ఇప్పుడు ఆగమైతున్నది. కరెంట్ కష్టాలతో కకావికలమవుతున్నది.
హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ)/(స్పెషల్ టాస్క్ బ్యూరో): పొద్దుగాల ఐదింటికి నిద్ర లేవాలి.. పొలానికి పోవాలి.. ఆటోమెటిక్ స్టార్టర్ ఆన్చేయాలి. పశువులకు మేత పెట్టి పాలు పిండుకుని మళ్లీ ఇంటిబాట పట్టాలి. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రైతుల దినచర్య ఇది. ఒకవేళ స్విచ్చు ఆఫ్ చేయడం మరిచిపోతేనో.. లేక ఏదో పనుండి ఇంటిపట్టునే ఉంటేనో పక్కపొంటి పొలం రైతుకు ఫోన్ చేసి ‘అన్నా.. గా స్విచ్చు బంద్ జెయ్యే’ అనేంత ధీమా ఉండేది. కేసీఆర్ సర్కారు వ్యవసాయానికి ఇచ్చిన నిరంతర నాణ్యమైన విద్యుత్తుయే ఈ భరోసాకు కారణం. మరిప్పుడేం జరుగుతున్నది?? అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా టార్చిలైట్లు పట్టుకొని రైతన్న పొలానికి పరుగులు పెడుతున్నాడు. అవసరమైతే అక్కడే నిద్రచేస్తున్నాడు. ఆన్ చేసినా మోటార్ ఎంత సేపు నడుస్తుందో తెలియదు. ఎడాపెడా కొనసాగుతున్న విద్యుత్తు కోతలతో పంటలెండిపోతుంటే, దాన్ని చూడలేని రైతన్నలు డబ్బులు చెల్లించి ట్యాంకర్లతో మడిని తడి చేయాల్సిన దుస్థితి. కేసీఆర్హయాంలో చీకట్లను చీల్చిన ఒకప్పటి విద్యుత్తు వెలుగుల తెలంగాణ ఇప్పుడు మసకబారిపోతున్నది. ఆనాటి కాంతిరేఖలు ఇప్పుడు కనుమరుగైపోతున్నాయి. హై టెన్షన్ తీగల్లో ఉండాల్సిన టెన్షన్.. ఇప్పుడు తెలంగాణ రైతన్నను పట్టి పీడిస్తున్నది. పంటల్లో జీవం వట్టిపోతున్నది. మండే ఎండకు పొట్టకొచ్చిన పంట నేల చూపులు చూస్తున్నది. రేవంత్ పాలనలో కొనసాగుతున్న కరెంట్ కోతలతో అన్నదాతల వెతలకు నిదర్శనమిది.
‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోతే అంధకారమవుతది’ అని నాటి ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హేళనగా మాట్లాడారు. తెలంగాణ వస్తే పవర్‌కట్ అయితదని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అయితే, కేసీఆర్ దార్శనికతతో తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ వెలుగులీనింది. పొరుగునున్న ఏపీనే ముక్కున వేలేసుకొనేలా వ్యవసాయానికి నిరంతరాయ విద్యుత్తు సరఫరా చేసింది. అయితే, ఇదంతా నిన్నటి ముచ్చట. రెండున్నరేండ్ల రేవంత్ పాలనలో తెలంగాణలో మళ్లీ కరెంట్ కోతలు నిత్యకృత్యంగా మారాయి. అప్రకటిత కోతలు రైతుల ఉసురు తీస్తున్నాయి. ప్రత్యేకించి సాగుకు త్రీఫేజ్ విద్యుత్తుకు ప్రస్తుతం తీవ్ర కటకట నెలకొన్నది. కేసీఆర్ పాలనలో వ్యవసాయానికి 24 గంటలపాటు నిరంతరాయ విద్యుత్తు సరఫరా జరగ్గా.. ఇప్పుడు 10-14 గంటలకు మించి కరెంట్ ఇవ్వడంలేదు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఏకంగా 8 గంటలు కోతపెడుతున్నారు. కొన్ని జిల్లాల్లో అయితే 10-12 గంటలకు మించి కరెంట్ సరఫరా జరుగడంలేదు. ఎండల నేపథ్యంలో విద్యుత్తుకు డిమాండ్ పెరిగింది. అయితే, ముందస్తు ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టడంలో ఎప్పటిలాగే విఫలమైన కాంగ్రెస్ సర్కారు.. డిమాండ్‌ను తీర్చాలన్న సాకుతో వ్యవసాయానికి సరఫరాను తగ్గిస్తున్నది. ఒకరకంగా సాగుకు అవసరమైన మేరకు విద్యుత్తును ఇవ్వలేక చేతులెత్తేస్తున్నది. రాష్ట్రంలో అనేక ఫీడర్లకు విద్యుత్తు సరఫరాను అధికారులు తగ్గిస్తున్నట్టు రిపోర్టులు వస్తున్నాయి. మొన్నటివరకూ 16 నుంచి 17 గంటలు విద్యుత్తు మాత్రమే ఇవ్వగా, ఇప్పుడు ఆ సరఫరా వ్యవధిని మరింతగా తగ్గిస్తున్నారు. చాలా జిల్లాల్లో అయితే 12 గంటలే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఫలితంగా కరెంట్ కోతలు తెలంగాణ రైతన్నకు కొత్త వెతలు తెచ్చిపెడుతున్నాయి. ఆరుగాలం శ్రమించిన అన్నదాతకు కష్టకాలాన్ని మిగులుస్తున్నాయి. ఇప్పటికే పంటలు ఎదిగాయి. వరి కంకి దశలో ఉంది. ఇంకో పదిహేను రోజులు గడిస్తే చాలు గండం గడిచినట్టేనని అన్నదాత అనుకొంటున్న సమయంలో కరెంట్ కోతలు తీరని దుఃఖాన్నే మిగులుస్తున్నాయి. కరెంట్ లేక.. పొలాలు పారక రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎండిన దుక్కులకు, తడి ఆరిన వరిచేలకు ప్రాణం పోసేందుకు అరిగోసపడుతున్నారు.
అన్ని రంగాలకూ కరెంట్ జీవనాడి వంటింది. అన్నంపెట్టే సాగురంగానికి ఇదే కల్పతరువు. అలాంటి కీలక విద్యుత్తు వ్యవస్థ కాంగ్రెస్ పాలనలో కకావికలమవుతున్నది. ‘కాంగ్రెస్ వచ్చింది.. కారుచీకట్లు తెచ్చింది’ అన్నట్టుగానే ఇప్పుడు పరిస్థితి తయారయ్యింది. బీఆర్ఎస్ హయాంలో వెలుగులు విరజిమ్మిన తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో కారుచీకట్లు కమ్ముకుంటున్నాయి. రెండున్నరేండ్ల వ్యవధిలో విద్యుత్తు రంగాన్ని పట్టించుకోకపోవడం, ముందస్తు ప్రణాళికలు లేకపోవడం, ఉదాసీనత వెరసి రాష్ట్రంలో ప్రజలకు, రైతులకు మళ్లీ కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. ఎండలు పూర్తిగా ముదురకముందే మార్చిలోనే అప్రకటిత కోతలు ప్రారంభమయ్యాయి. ఒకవైపు భూగర్భ జలాలు అడుగంటడం, మరోవైపు చాలీచాలని కరెంట్‌తో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పంటలు ఎండిపోతున్నాయి. గత్యంతరంలేని పరిస్థితుల్లో సొంత డబ్బులతో అన్నదాతలు ట్యాంకర్లతో మడిని తడుపుతున్నారు. ఆ స్థోమత కూడా లేని కర్షకులు ‘కరెంటో రామచంద్రా’ అంటూ ప్రభుత్వాన్ని వేడుకొంటున్నారు. మార్చిలోనే కరెంట్ కోతలు ఇలా ఉంటే, రానున్న మేలో పరిస్థితేంటని పలువురు రేవంత్ సర్కారును నిలదీస్తున్నారు.

‘నీది ఏ రాజకీయ పార్టీ’ అని అడిగి ఏ రైతు కూడా తిండి గింజను పండించడు. తనోడైనా, పగోడైనా అన్నం పెడ్తాడు. అదే అన్నదాతకు ఉన్న గొప్పతనం. అయితే, రాజకీయాల మత్తులో తూగుతున్న కాంగ్రెస్ సర్కారు రైతన్నల పట్ల కూడా వివక్షను ప్రదర్శిస్తున్నది. ఒక్కో జిల్లాలో రైతులను ఒక్కోరకంగా చూస్తున్నది. ప్రతిపక్ష నేతల మీద కక్ష పెంచుకుని.. రైతుల ఉసురుపోసుకొంటున్నది. సాగుకు సరిపడా కరెంట్ లేక రైతులు అవస్థలు పడుతుంటే.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై పగ పెంచుకొన్న అధికార పక్షం.. వాళ్లను టార్గెట్ చేయాలన్న ఉద్దేశంతో ఆయా నియోజకవర్గాల్లో కోతలను మరింత తీవ్రం చేస్తున్నది. ప్రత్యేకించి కొన్ని జిల్లాల పట్ల తీవ్ర వివక్షను చూపుతూ త్రీఫేజ్ విద్యుత్తుకు భారీగా కోతలు పెడుతున్నది. ముఖ్యంగా బీఆర్ఎస్కు పట్టున్న సిద్దిపేట జిల్లాలో.. రోజులో సగం కాలంపాటు కోతలే రాజ్యమేలుతున్నాయి. 12 గంటల కరెంటును సరఫరా చేస్తున్నట్టు రికార్డుల్లో నమోదు చేస్తున్నా.. మధ్యలో అంతరాయం, లైన్‌కట్ వంటి సమస్యలతో మరికొన్ని గంటలకు కోతలను పెంచుతున్నారు. దీంతో ఆ కొంత మేర సరఫరా అయ్యే కరెంట్ తమ పంటలకు ఏ మాత్రం సరిపోవట్లేదని రైతులు వాపోతున్నారు. ఇక దుబ్బాక నియోజకర్గంలో మరో ధీన పరిస్థితి కనిపిస్తున్నది. ఇక్కడి చాలా ప్రాంతాల్లో తెల్లవారుజామున 3.30గంటల నుంచి త్రీఫేజ్ సరఫరా ప్రారంభమవుతున్నది. దీంతో చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు నిద్రాహారాలు మాని రైతులు పొలాల దగ్గరే పడిగాపులుకాస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో పరిస్థితి ఇలా ఉంటే, నిజామాబాద్ జిల్లాలో మాత్రం వేరుగా కనిపిస్తున్నది. ఇక్కడ రోజుకు 16 -17 గంటల విద్యుత్తును సరఫరా చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోనూ 16 గంటల విద్యుత్తును ఇస్తున్నారు. దీంతో కామారెడ్డికో రూల్.. సిద్దిపేటకో రూలా? అంటూ పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇదేం వివక్ష ? రైతులు ఎక్కడైనా రైతులే కదా..? రైతాంగానికి రాజకీయాలు అద్దడమేంటీ?? రైతు ప్రభుత్వమంటే ఇదేనా..? అంటూ రేవంత్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు.

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కరెంట్ కోతలు మరింత తీవ్రమయ్యాయి. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో కరెంట్ కోతలు రైతన్నను కలవరపెడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ ఏడాది ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో విద్యుత్తు డిమాండ్ భారీగా పెరిగింది. శనివారం ఒక్కరోజే 2,100 మోగావాట్ల విద్యుత్తు డిమాండ్ నమోదయ్యింది. 2025లో ఇదే రోజున విద్యుత్తు డిమాండ్ 1,475 మెగావాట్లు మాత్రమే. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిరుడు 1,300 మెగావాట్ల డిమాండ్ ఉండగా, ఈ ఏడాది డిమాండ్ 1,450 మోగావాట్లకు పెరిగింది. ఇదేకాకుండా సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో సాయంత్రం 5 గంటల తర్వాత సింగిల్ ఫేజ్‌కు మార్చేస్తున్నారు. ఇక స్వరాష్ట్రంలో విద్యుత్తు సరిపోకపోవడంతో చేబదులు (స్వాపింగ్) రూపంలో ఉత్తరాది రాష్ర్టాల నుంచి విద్యుత్తును కొనుగోలు చేసే పరిస్థితి ప్రస్తుతం తలెత్తింది.

విద్యుత్తు రంగంలో తెలంగాణ రాష్ర్టానిది దిగ్విజయ చరిత్ర. కేసీఆర్ అచంచల కృషితోనే ఇది సాకారమైంది. ‘కరెంట్ తీగలు బట్టలారేసుకోవడానికి తప్ప ఎందుకు పనికిరావు’ అన్న కిరణ్‌కుమార్‌రెడ్డి వెక్కిరింతలకు దీటుగా జవాబిచ్చిన కేసీఆర్ ప్రభుత్వ హయాంలోని అప్పటి తెలంగాణ విద్యుత్తు అవరోధాలను క్రమంగా దాటింది. రైతులకు ఉచితంగా 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా అందించి కేసీఆర్ దేశ వ్యవసాయ రంగ చరిత్రలోనే కొత్త రికార్డులు సృష్టించారు.
వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు కోసం తొమ్మిదేండ్లలో దాదాపు రూ. 75 వేల కోట్లను అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు చేసింది. 2014 నుంచి రైతులకు విద్యుత్తు సబ్సిడీ పేరిట రూ. 36,889 కోట్ల సబ్సిడీని ప్రభుత్వమే భరించింది. అది కాకుండా రూ. 39 వేల కోట్లతో విద్యుత్తు రవాణా, ట్రాన్స్ఫార్మర్స్, వైర్లైన్ల మరమ్మతులు, కొత్త నిర్మాణాలు తదితర ఆధునికీకరణ పనుల కోసం ఖర్చు చేసింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 8.17 లక్షల కొత్త వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వటంతో వాటి సంఖ్య 27.2 లక్షలకు చేరింది. అలా కేసీఆర్ ప్రభుత్వం రైతులకు కరెంట్ కష్టాలను దూరం చేసింది. పరిశ్రమలకు భరోసానిచ్చింది. పెట్టుబడిదారుల్లో దిలాసా నింపింది. మొత్తంగా తెలంగాణను విద్యుత్తు ధగధగల్లో వెలిగించి ప్రపంచ పటంలో ప్రకాశింపజేసింది. ఫలితంగా తెలంగాణ వరిధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రమయ్యింది. రాష్ట్రం పండించిన పంటను మేం కొనలేం బాబోయ్ అంటూ కేంద్రం చేతులెత్తేసే పరిస్థితికి రాష్ట్రం ఎదిగింది. కానీ, ఇవ్వాళ అదే రాష్ట్రంలో రైతులను మళ్లీ కరెంట్ కష్టాలు చుట్టుముట్టాయి. కరెంట్ కోసం రైతులు సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేయాల్సిన దుస్థితి వాటిల్లింది. లోవోల్టేజీతో మోటార్లు కాలిపోతే బాగుచేసుకోవాల్సిన కాలం మళ్లీ దాపురించింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ చివరి ముఖ్యమంత్రి చెప్పిన కరెంట్ కష్టాలను తెలంగాణలో తొలి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తెచ్చి చూపెడుతున్నది. అదీ అసలైన విషాదం!

కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో వ్యవసాయానికి 24 గంటల పాటు నిరంతరాయ విద్యుత్తును సరఫరా చేయడంతో తెలంగాణలో సాగురంగం గణనీయమైన పురోగతి సాగించింది. రేవంత్ ప్రభుత్వ పాలనలో విద్యుత్తు కోతలు పెరుగుతున్నట్టు అర్థమవుతున్నది. మౌలిక వసతులు ఉన్నప్పటికీ, డిమాండ్‌కు సరిపడా విద్యుత్తు సరఫరాను చేయకపోవడం సర్కార్ వైఫల్యంగానే చెప్పొచ్చు. కరెంట్ కోతలు నిలిపేయాలంటూ నిర్మల్, కరీంనగర్ జిల్లాల్లో మార్చి తొలివారంలో పలువురు రైతులు సబ్స్టేషన్ల ఎదుట నిరసనలు తెలుపడం రాష్ట్రంలో కరెంట్ కష్టాలకు అద్దంపడుతున్నది.
కేసీఆర్ పాలనలో నిప్పులు కురిపించే మే నెలలో పవర్ కట్స్-0
రేవంత్ పాలనలో మార్చిలోనే విద్యుత్తు కోతలు-13 నుంచి 14 గంటలు
కేసీఆర్ హయాంలో 24 గంటల కరెంట్ ఇచ్చిండు. పొలం మొత్తం తడిసేదాకా మోటర్ నడిపినం. ఇంటికాడ ఉండి పొలాలు రందిలేకుండ పారించినం. రాత్రిపూట పొలంకాడికి పోయే బాధ లేకుండె. కాంగ్రెస్ వచ్చి అంతా ఆగం చేసింది. నేను ఆరెకరాల్లో వరి సాగు చేస్తున్న. రాత్రి 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఉండాల్సిన కరెంట్ ఎప్పుడస్తదో, ఎప్పుడు పోతదో తెలుస్తలేదు. శనివారం రాత్రి 12 గంటలకు రావాల్సింది 3 గంటలకచ్చింది. మళ్ల పాత రోజుల్లెక్క కరెంటు కోతలు నిత్యకృత్యమైనయ్. సరిపోను కరెంటు లేక నీళ్లందక పొలం ఎండిపోతాంది. ఓ మడికి ఇయ్యాల.. ఓ మడికి రేపు అని పారించుకుంట పోతున్నం. మార్చిలోనే ఇట్ల ఉంటే మున్ముందు ఎట్లుంటదో తలచుకుంటెనే భయమైతాంది
– రాళ్లబండి స్వామి, కోటపల్లి, మంచిర్యాల జిల్లా
ఈ యాసంగిలో బావులు, బోర్ల మోటర్లు బాగా కాలిపోతున్నయి. ఒక్కోసారి మోటర్ రెండు మూడుసార్లు కాలిపోతే ఆ రైతును చూసి మాకే బాధ అనిపిస్తున్నది. మోటర్ రిపేర్ ఖర్చులు, పెట్టుబడి, ఇటీవల వచ్చిన భారీ ఈదురు గాలలతో జరిగిన పంట నష్టం ఇవన్నీ చూస్తే ఈసారి రైతులు నిండా మునిగిన పరిస్థితి ఉంది. కరెంట్ సరిగా రావడం లేదు. దీనికి తోడు భూగర్భ జలాలు అడుగంటినయి. లోవోల్టేజీ కరెంట్ వస్తుండటంతో స్టార్టర్ల వద్ద కెపాసిటర్లను పెడుతున్నం. రోజుకు రెండు, మూడు మోటర్లు రిపేర్ చేస్తున్న. కెపాసిటర్లు పెట్టే కాలం వస్తది అనుకోలేదు. రైతులకు మళ్లీ గడ్డు కాలం కనిపిస్తున్నది.
– బండి సంజీవ్, మెకానిక్, అక్కన్నపేట (సిద్దిపేట జిల్లా)