హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): వివాహానికి ముందు, తర్వాత, పిల్లలు పుట్టినప్పుడు మహిళకు వచ్చే డబ్బుతో (స్త్రీ ధనం) ఏదైనా ఆస్తిని కొనుగోలు చేశామంటే చాలదని, తగిన ఆధారాలు ఉండాలని హైకోర్టు స్పష్టంచేసింది. స్త్రీ ధనంతో ఆస్తి కొనుగోలుచేసినట్టు ఆధారాలు లేకుండా ఆ ఆస్తి తనదని క్లెయిమ్ చేయ డం చెల్లదని తీర్పు చెప్పింది. 2025 సెప్టెంబర్‌లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు ప్రధాన న్యాయమూర్తి అపరేష్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం నిరాకరించింది.
స్త్రీ ధనం అంటే వివాహానికి ముందు, వివాహ సమయంలో, లేదా వివాహం తర్వాత, అలాగే బిడ్డ పుట్టినప్పుడు లేదా వైధవ్యం సమయంలో ఒక మహిళకు లభించిన (చర లేదా స్థిర) బహుమతు లు అని, ఈ తరహా ఆస్తిని ఎలాంటి ఆంక్షలు లేకుండా అనుభవించడానికి, బదిలీ చేయడానికి ఆమెకు సంపూర్ణ హకులు ఉంటాయని తెలిపింది.
2007లో కోర్టు నిర్వహించిన వేలం ద్వారా హసన్‌పర్తి జిల్లా, నాగారం గ్రామంలోని 8 ఎకరాల వివాదాస్పద భూమిని పొందిన ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా భూ రికార్డులను మ్యుటేషన్ చేయాలని గతంలో సింగిల్ జడ్జి అధికారులను ఆదేశించారు. వాస్తవానికి అప్పీలుదారు భర్తకు చెందిన ఈ భూమిని కోర్టు వేలం వేయడంతో ప్రైవేట్ వ్యక్తులు దక్కించుకున్నారు. ఆ భూమిని తనకు చట్టప్రకారం లభించిన స్త్రీధనంతో కొనుగోలు చేశారని, మ్యూటేషన్ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ మహిళ అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన చీఫ్ జస్టిస్ బెంచ్, అప్పీల్‌దారులు తనకున్న యాజమాన్య హకు పత్రాలు, సాక్ష్యాలను సమర్పించలేదని పేర్కొన్నది.