హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని ఆదేశించారు. అవకతవకలకు అవకాశం లేకుండా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ ఉండాలని, అధికారులకు విధుల కేటాయింపు, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు.. ఇలా ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పర్యవేక్షించాలని సూచించారు. అర్హత గల ప్రతిఒకరూ ఓటరు జాబితాలో ఉండేలా పర్యవేక్షించాలని, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి వచ్చేలా చూడాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో ఏసీగార్డ్స్‌లోని ఎస్ఈసీ కార్యాలయం నుంచి కమిషన్ కార్యదర్శి లింగ్యానాయక్, ఇతర ఎన్నికల అధికారులతో కలిసి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాల ప్రకటన, నామినేషన్ కేంద్రాలు, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లపై ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు, ఆరు మున్సిపల్ కార్పొరేషన్లలో 2వ సాధారణ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని సూచించారు.
తుది ఓటర్ల జాబితా ఈనెల 12న ప్రచురించాలని కమిషనర్ రాణికుముదిని చెప్పారు. పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితాను 13న ప్రచురించి, టీపోల్ యాప్‌లోనూ అప్లోడ్ చేయాలని సూచించారు. ఫొటోలతో కూడిన తుదిఓటర్ల జాబితా పోలింగ్స్టేషన్ల వారీగా 16న వెల్లడించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు అంచనా వేయాలని, అవసరమైన సామగ్రిని సిద్ధం చేయాలని, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, జోనల్ అధికారుల నియామకం త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఫ్లైయింగ్ స్కాడ్ టీమ్స్ (ఎఫ్ఎస్టీ), స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ (ఎస్ఎస్టీ) బృందాల నియామకం కూడా పూర్తి చేయాలని చెప్పారు. పోలింగ్ సిబ్బంది నియామకం కోసం ఉద్యోగుల వివరాలను టీపోల్‌లో తక్షణమే అప్డేట్ చేయాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రం పరిధిలో నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, ఫొటో ఓటరు జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల వివరాల ప్రకటన, పోలింగ్ కేంద్రాలవారీగా ఫొటో ఓటరు జాబితాల ప్రకటనపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.