ఇల్లంతకుంట రూరల్, ఫిబ్రవరి 10 : సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్ ప్రాజెక్టు నుంచి సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాలకు నీరందించే ఎస్-6 కెనాల్‌ను వెంటనే పూర్తిచేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ శివారులోని సబ్ స్టేషన్ వద్ద రైతులు రిలేదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రంగనాయకసాగర్ ప్రాజెక్టు నుంచి ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్, దాచారం, రామోజీపేట, వెల్జిపూర్, తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్, లక్ష్మీపూర్, బస్వాపూర్, బాలయ్యపల్లి తదితర గ్రామాలకు నీరందించేందుకు గత బీఆర్ఎస్ సర్కార్ ఎస్-6 కెనాల్ నిర్మాణాన్ని చేపట్టిందని పేర్కొన్నారు.
బోటిమీదపల్లి శివారు వరకు పనులు చేసిందని, అంతలోనే ప్రభుత్వం మారిందని చెప్పారు. కాంగ్రెస్ వచ్చాక నిర్మాణ పనులను నిలిపివేసిందని ఆరోపించారు. గతేడాది ఫిబ్రవరిలో రిలేదీక్ష చేపడితే, ఎమ్మెల్యే కవ్వంపల్లి వచ్చి ఆరు నెలల్లో కాలువ నిర్మాణాన్ని పూర్తిచేస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ ఏడాది గడిచిపోయిందని ఆగ్రహించారు. కెనాల్ పూర్తికాకపోవడంతో 20 గ్రామాల్లోని వేలాది ఎకరాల్లో పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. బుధవారం నుంచి వందల సంఖ్యలో రైతులు దీక్షలో కూర్చుంటారని, కెనాల్ పనులు మొదలుపెట్టే దాకా ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కెనాల్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు వెంటనే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.