రంగారెడ్డి, ఫిబ్రవరి 10 (నమస్తేతెలంగాణ): యాసంగి సీజన్ పూర్తికావస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి రైతులకు రావల్సిన రూ.500 బోనస్ (Paddy Bonus) మాత్రం అందటంలేదు. రైతుభరోసాకు ఎగనామం పెట్టిన కాంగ్రెస్ సర్కార్ తమకు రావల్సిన బోనస్ అయినా ఇస్తుందని ఆశించిన అన్నదాతకు నిరాశే మిగిలింది. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రైతులకు మరో రూ.కోటి వరకు బోనస్ డబ్బులు రావల్సి ఉంది. గత అక్టోబర్‌లో వానాకాలం సీజన్లో రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన సన్న వరిధాన్యానికి క్వింటాల్‌కు రూ.500బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
దీంతో జిల్లా వ్యాప్తంగా 1,971మంది రైతులు సుమారు 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. దీనికి సంబంధించిన బోనస్ రూ.2.88 కోట్లు రైతులకు అందాల్సి ఉంది. కాని, గడిచిన ఐదు నెలలుగా రైతులకు కేవలం రూ.1.33కోట్లు మాత్రమే చెల్లించింది. మరో రూ.కోటీ 55 లక్షలు పెండింగ్ పెట్టింది. రైతుల ఆరుగాలం పండించిన పంటలకు ప్రభుత్వం మద్ధతుధరతో పాటు బోనస్ క్వింటాల్‌కు రూ.500 ఇస్తామని ప్రకటించింది. జిల్లావ్యాప్తంగా 38కేంద్రాల నుంచి పదివేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఇందులో సుమారు 6వేల మెట్రిక్ టన్నులు సన్న వడ్లను కొనుగోలు చేశారు. అప్పటినుంచి బోనస్ డబ్బుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. బోనస్ డబ్బులు వస్తే యాసంగి పెట్టుబడికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
జిల్లాలో రూ.1.55కోట్ల బకాయిలు..
జిల్లావ్యాప్తంగా సన్నవడ్లు విక్రయించిన సుమారు 5వేలమంది వరకు రైతులకు ప్రభుత్వం బోనస్ కింద రూ.1.55 కోట్లు చెల్లించాల్సి ఉంది. గత నాలుగు నెలలుగా బోనస్ డబ్బుల కోసం అన్నధాతలు ఎదురుచూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సన్నవడ్లు పండించే రైతులు 1,121మంది బోనస్కోసం నిరీక్షిస్తున్నారు. తమకు రావల్సిన బోనస్ బకాయిలను వెంటనే అందించాలని కోరుతున్నారు.