రంగారెడ్డి, జనవరి 24 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా పెద్ద ఎత్తున అక్రమ భూ లావాదేవీలు జరిగిన ఉదంతంలో విచారణ ఇంకా కొనసాగుతుండగా, ఇప్పటివరకు అసలు పాత్రధారులెవరు? సూత్రధారులెక్కడ? అనేది తేలలేదు. ఈ నేపథ్యంలోనే ధరణి కమిటీ ముందు బుధవారం రంగారెడ్డి కలెక్టర్ శశాంక హాజరవడంప్రాధాన్యతను సంతరించుకున్నది. పోర్టల్లో మార్పులు చేర్పులు చేసేందుకు సమాయత్తమవుతున్న ప్రభుత్వం ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న అక్రమాలపై కూలంకషంగా చర్చించినట్టు తెలుస్తున్నది.
రంగారెడ్డి జిల్లాలో గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో 98 ఫైళ్లకు సంబంధించి అక్రమ లావాదేవీలు జరిగాయి. నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సైతం రిజిస్ట్రేషన్లు జరిగాయి. కలెక్టర్ దగ్గర దీనికి సంబంధించి ‘కీ’ ఉండగానే ఈ వ్యవహారం చోటుచేసుకున్నది. దీన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం అప్పటి కలెక్టర్ భారతీహొలికెరిపై బదిలీవేటు వేసింది. బాధ్యులైన ఇద్దరు పొరుగు సేవల ఉద్యోగులపై పోలీసు కేసు నమోదు చేశారు. దీనిపై ఓ పక్క పోలీసు విచారణ జరుగుతుండగా.. ఈ అక్రమ బాగోతంలో అసలు సూత్రధారులు, పాత్ర ధారులెవరు? అన్నది సీసీఎల్ఏ స్థాయిలోనే తేల్చే పనిలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.