నారాయణరావుపేట, ఫిబ్రవరి 19: రంగనాయకసాగర్ ప్రాజెక్ట్ ఎడమ కాలువ నుంచి సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ బుధవారం సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలోని మల్యాల, బంజేరుపల్లి రైతులు రాఘవాపూర్ రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రంగనాయకసాగర్ ప్రాజెక్టు ద్వారా కొన్ని రోజులుగా నీటిని విడుదల చేశారని, ప్రస్తుతం కాలువల్లో నీటి ప్రవాహం తగ్గి సాగునీరు అందడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మండుటెండల్లో సైతం సాగునీరు అందించి ఇబ్బందులు లేకుండా చూశారని పేర్కొన్నారు. ఇరిగేషన్ అధికారులు వచ్చి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నీరందిస్తామని హామీ ఇచ్చారు.