Congress Party | ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు బాకీ పడ్డ సంగతి తెలిసిందే. ఎన్నికల ముందొక మాట.. ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడుతున్న కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరిపై క్షేత్ర స్థాయిలో ఎలాంటి వ్యతిరేకత ఉందో తెలిపే వీడియో ఇది.. కాంగ్రెస్ పార్టీ పాలనలో హామీల అమలు ఎక్కడ అంటూ ఓ వ్యక్తి నిలబడి చదివాడు. దీంతో సదరు వ్యక్తి ప్రశ్నలను జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు అతనిపై పీఎస్లో ఫిర్యాదు చేశారు.
మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని రంగంపేటలో ఓ వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను చదువుతూ ఇవి అమలు కాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ‘ఓరి రేవంత్.. మహిళలకు రూ.2500 ఇస్తా అన్నవ్.. అదేదిరా.. వృద్ధులకు, బీడీ కార్మికులకు నెలకు రూ.4000 పెన్షన్ ఇస్తా అంటివి.. అదెటువోయింది.. వికలాంగులకు నెలకు రూ.6000 పెన్షన్ ఇస్తా అంటివి.. అదెటువోయింది’ అంటూ బాకీకార్డులు చదివాడు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను రంగం పేట గ్రామంలో నిలబడి చదివిన వ్యక్తిపై కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.