హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 21 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం గిరికొత్తపల్లి గ్రామానికి ఆదరువైన రంగ సముద్రం చెరువుకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. రియల్ వలలో చిక్కుకుని ఉనికి కోల్పోవడంతో గ్రామ పరిధిలో తాగు, సాగునీటికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో రైతులు చాలాకాలంగా చెరువుకు పూర్వ వైభవం తెచ్చేందుకు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఈ క్రమంలో నమస్తే తెలంగాణ ‘రియల్ వలలో రంగ సముద్రం విలవిల’ శీర్షికన సమస్యను వెలుగులోకి తెచ్చింది. దీనిపై నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి చెరువు పునరుద్ధరణకు చేపట్టాల్సిన పనులపై గతంలోనే సర్వే నిర్వహించారు.
వర్షాలు మొదలైన దరిమిలా ప్రస్తుతం నీటిపారుదల శాఖ అధికారులు వాగు, ఎగువ ప్రాంతం నుంచి చెరువులోకి వరద వచ్చేలా ప్రాథమిక పనులు చేపట్టేందుకు నిర్ణయించారు. గిరికొత్తపల్లి రైతు సంక్షేమ సంఘం వారే పనులు చేపట్టేందుకు అనుమతిచ్చారు. దీంతో మూడు రోజుల కిందట కత్వా, ఫీడర్ చానల్ పనులు మొదలయ్యాయి. ఫీడర్ చానల్ పొడవునా పేరుకుపోయిన చెట్లను తొలగించి, చెరువులోకి వరద నీరు సాఫీగా వెళ్లేలా పనులు పూర్తి చేశారు. ధ్వంసమైన కత్వాను పునరుద్ధరిస్తున్నారు. ఈ పనులు పూర్తయితే దాదాపు ఏడెనిమిది ఏండ్ల తర్వాత చెరువులోకి వరద నీరు రానున్నది. కోడ్ ముగిసిన తర్వాత చెరువు కట్ట బలోపేతం తో పాటు ఇతరత్రా పనులు చేపట్టనున్నారు.