హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 2 (నమస్తే తెలంగాణ)/మణికొండ: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని కొత్వాల్‌గూడ గ్రామంలో 52 ఎకరాల భూమిపై నెలకొన్న వివాదం ఎట్టకేలకు పరిష్కారమైంది. దాదాపు రూ.250 కోట్లకు పైగా విలువ చేసే ఈ భూములు ప్రభుత్వానికి చెందినవేనంటూ రంగారెడ్డి రెండో అదనపు జిల్లా న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ న్యాయవాది రెవెన్యూ అధికారులకు లిఖితపూర్వకంగా సమాచారం అందించారు. విలువైన భూములు కావడంతో తీర్పు ప్రతి అందేలోపు భూముల్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని ముందుగానే అప్రమత్తం చేశారు. దీంతో శంషాబాద్ తాసిల్దార్ ఆధ్వర్యంలో అధికారులు ఆ భూముల రక్షణకు చర్యలు మొదలుపెట్టారు.
కొత్వాల్‌గూడ గ్రామంలోని సర్వేనంబర్ 54లో 270.17 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిలోని అత్యధిక విస్తీర్ణాన్ని పలు ప్రజా ప్రయోజనకర అవసరాలకు వినియోగించారు. ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ రిసెర్చి ల్యాబరేటరీ (ఏపీఈఆర్‌ఎల్) కూడా ఇందులోని 30 ఎకరాల విస్తీర్ణంలోనే ఏర్పాటైంది. కొన్ని దశాబ్దాల కిందట హుడాకు 75 ఎకరాలు కేటాయించారు. పర్యాటక శాఖకు 50 ఎకరాలు ఇచ్చారు. రైల్వే వర్క్‌షాప్ ఏర్పాటుకు 12 ఎకరాలు కేటాయించారు. హెచ్ఎండీఏకు 45 ఎకరాలు ఇవ్వగా… గతంలోని 75 ఎకరాలతో కలుపుకొని కొత్వాల్‌గూడ ఎకో టూరిజం పార్క్‌ను అభివృద్ధి చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఏకంగా రూ.180 కోట్లతో ఈ పార్క్ అభివృద్ధిని చేపట్టారు. మరో ఐదెకరాల్లో చౌడమ్మ దేవాలయం, ఎకరంలో హనుమాన్ దేవాలయం ఉండగా… 15 గుంటలను శ్మశాన వాటికకు కేటాయించారు. ఇవన్నీపోను 52 ఎకరాల భూమి ఉంది. దీనిపైనే ఉమ్మడి రాష్ట్రం నుంచి వివాదం కొనసాగుతున్నది.
ఈ 52 ఎకరాల భూమి ప్రస్తుతం 26 మంది ప్రైవేటు వ్యక్తుల పేరిట ఉంది. నిజాం దగ్గర పనిచేసినందుకుగాను గాలయ్య అనే వ్యక్తికి నవాబు ఈ 52 ఎకరాలను ఇచ్చారని, తద్వారా వారి వారసుల నుంచి తాము భూములను కొనుగోలు చేశామని సదరు ప్రైవేటు వ్యక్తులు పేర్కొంటున్నారు. మరో రకమైన వాదన కూడా ప్రచారంలో ఉంది. గాలయ్య అనే వ్యక్తికి ఉన్న 52 ఎకరాల భూమి హిమాయత్‌సాగర్ రిజర్వాయర్‌లో పోయినందున… అందుకు ప్రతిగా ఈ భూమి కేటాయించారని చెప్పుకుంటున్నారు.
ఈ వాదనను రెవెన్యూ అధికారులు తిరస్కరించారు. గాలయ్యకు నష్టపరిహారం చెల్లించారు తప్ప భూమికి బదులుగా భూమి ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమకు పట్టా పాసు పుస్తకాలు జారీ చేయాలంటూ 2006లో ప్రైవేటు వ్యక్తులు రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకోగా వారు తిరస్కరించారు. దీంతో అప్పట్లో రెండో అదనపు జూనియర్ సివిల్ కోర్టును ఆశ్రయించగా వారికి అనుకూలంగా తీర్పు వచ్చినట్టు తెలిసింది. దీంతో సదరు వ్యక్తులు 52 ఎకరాల భూమిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
కోర్టు తీర్పుపై రెవెన్యూ శాఖ అప్పీలుకు వెళ్లింది. ఈ మేరకు 2018లో రంగారెడ్డి రెండో అదనపు జిల్లా న్యాయస్థానంలో దాదాపు 20 వరకు దావాలు వేశారు. గత ఆరేండ్లుగా వీటిపై వాదనలు కొనసాగాయి. ఎట్టకేలకు ఇటీవల న్యాయస్థానం తుది తీర్పు ఇచ్చింది. కొత్వాల్‌గూడ సర్వేనంబరు 54లోని 270.17 ఎకరాలు పూర్తిగా ప్రభుత్వ భూమి అని న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అయితే అధికారికంగా తీర్పు ప్రతి ఇంకా వెలువడలేదని తెలిసింది.
ఈ నేపథ్యంలో రెవిన్యూ శాఖను అప్రమత్తం చేసి భూములను రక్షించేందుకుగాను ప్రభుత్వ న్యాయవాది (జీపీ) రాజ్‌కుమార్ శంషాబాద్ తాసీల్దార్ రవీంద్రదత్తకు లిఖితపూర్వకంగా సమాచారం ఇచ్చారు. ప్రభుత్వ భూమి అని తీర్పు రావడం సంతోషకరమని, ఈ క్రమంలో జీపీ ముందుగానే అప్రమత్తం చేసిన దరిమిలా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న 52 ఎకరాల స్వాధీనానికి చర్యలు తీసుకుంటామని తాసీల్దార్ రవీంద్ర దత్త ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.