అయిజ, ఏప్రిల్ 12 : జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో మార్చి 17న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో మృతిచెందిన రాము (17) బైపీసీలో 954, విష్ణు చైతన్యగుప్తా 960 మార్కులతో ఉత్తీర్ణత సాధించి ప్రతిభ చాటారు. అయిజ పట్టణానికి చెందిన రామంజనమ్మ- మల్లేశ్ దంపతుల కుమారుడు రాము.. వినుత-నాగరాజుశెట్టి దంపతుల కుమారుడు బెల్లంకొండ విష్ణుచైతన్యగుప్తా హైదరాబాద్ శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు పూర్తిచేసుకొని అయిజకు వచ్చారు. తిరిగి నీట్, ఎంసెట్ కోచింగ్ కోసం స్నేహితులతో కలిసి మార్చి 17న హైదరాబాద్కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. రైలు ఆలస్యం కావడంతో టీ తాగేందుకు బైక్పై పట్టణంలోకి వెళ్తున్న ముగ్గురు విద్యార్థులను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో రాము అక్కడికక్కడే మృతి చెందగా, మూడు రోజులుగా చికిత్స పొందుతూ విష్ణుచైతన్యగుప్తా మృతి చెందాడు. ఆదివారం విడుదలైన ఇంటర్ పలితాల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు తీవ్రవిషాదంలో మునిగిపోయారు.