Congress | హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఆది నుంచి అసమ్మతి సెగలు కక్కుతున్న కాంగ్రెస్ పార్టీలో నామినేషన్ల ఉపసంహరణ రోజూ నిరసనల సెగ తప్పలేదు. రెబల్స్‌తో పార్టీ జాతీయ నాయకులు జరిపిన చర్చల సందర్భంగా పలుచోట్ల నేతలకు టెన్షన్ తప్పలేదు. చర్చల కోసం వచ్చిన నాయకులను రెబల్ అభ్యర్థుల మద్దతుదారులు భౌతికదాడులకు దిగారు. కొన్నిచోట్ల రెబల్స్ నామినేషన్లను ఉపసంహరించుకున్నప్పటికీ.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మరికొంతమంది కాంగ్రెస్‌ను వదిలి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బరి నుంచి తప్పుకున్న నేతలకు తర్వాత పదవులు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ.. టికెట్ కేటాయించాక మరొకరికి బీఫామ్ ఇచ్చిన పరిస్థితులను కొందరు మరువులేక లోలోన రగిలిపోతున్నారు.
దీంతో పార్టీ తరఫున బరిలో ఉన్న అభ్యర్థులు రెబల్స్‌గా విత్‌డ్రా చేసుకున్నా వారిని పూర్తిస్థాయిలో నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలకు మరో 15 రోజుల గడువు మాత్రమే ఉండటంతో రెబల్స్ క్యాడర్ పార్టీ అభ్యర్థికి ఎంతవరకు సహకరిస్తారనేది అనుమానంగా మారింది. ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి టీపీసీసీ నాయకులు సంజీవరెడ్డి కాంగ్రెస్ రెబల్‌గా బరిలో నిలిచారు. బోథ్ నియోజకవర్గం నుంచి మొదటి జాబితాలో టికెట్ ఇచ్చిన వన్నెల అశోక్ నామినేషన్ దాఖలు చేశారు. చివరికి ఆయన స్థానంలో మరొకరికి టికెట్ కేటాయించడంతో అశోక్ ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. ఆయన బుధవారం తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన గంగారాం, బాన్సువాడలో కాసుల బాలరాజు, ఉమ్మడి వరంగల్ జిల్లా డోర్నకల్‌లో నెహ్రూనాయక్, వరంగల్ వెస్ట్‌లో జంగా రాఘవరెడ్డి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దండెం రాంరెడ్డి, ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో వన్నెల అశోక్, కరీంనగర్ జిల్లా చొప్పదండిలో నాగిశేఖర్, సంగారెడ్డి జిల్లా అనిల్‌కుమార్ తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
పటేల్ రమేశ్‌రెడ్డి అనుచరుల్లో అయోమయం
సూర్యాపేట నియోజకవర్గం నుంచి రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పటేల్ రమేశ్‌రెడ్డితో నామినేషన్‌ను విత్ డ్రా చేయించేందుకు రాయబారానికి వచ్చిన పీసీసీ సీనియర్ నేత మల్లు రవికి చేదు అనుభవం ఎదురైంది. నామినేషన్ విత్ డ్రాకు వెళ్లకుండా రమేష్‌రెడ్డి అనుచరులు మల్లు రవిని అడ్డుకొని దాడి చేశారు. ఈ నేపథ్యంలో మల్లు రవి ఏఐసీసీ నేతలతో ఫోన్లో సంప్రదింపులు జరిపి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో నల్లగొండ ఎంపీగా అవకాశం కల్పిస్తామని హామీ ఇప్పించారు. అనంతరం ఆయన ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి తన నామినేషన్‌ను విత్ డ్రా చేసుకున్నారు. కానీ ఈ పార్లమెంట్ స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇప్పటికే సీఎల్పీ నేత జానారెడ్డి అధిష్ఠానానికి స్పష్టం చేయడంతో రమేశ్‌రెడ్డి అనుచరుల్లో అయోమయం నెలకొంది.