హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గ్రామీణ ఆశా కార్యకర్తలకు అండగా ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి పోరాడుతామని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ తెలిపారు. గురువారం తెలంగాణభవన్‌లో ఆశా కార్యకర్తల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు రావుల సంతోష ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ జిల్లాల నుంచి సుమారు 300మంది కార్యకర్తలు హాజరై, వారి సమస్యలు ఏకరువుపెట్టారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్ గద్దెనెక్కి రెండున్నరేండ్లు దాటినా అమలులో ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. వేతనాలు పెంచుతామని ఆశచూపి.. ఇప్పుడు ఉన్న వేతనాలనే ప్రతినెలా ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారులు, మంత్రికి విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో పోరాటానికి కార్యాచరణ రూపొందిస్తామని వారు హెచ్చరించారు. అనంతరం రాంబాబుయాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల మాదిరిగానే ఆశా కార్యకర్తలనూ మోసం చేసిందని ధ్వజమెత్తారు.
వేతనాలు పెంచడం దేవుడెరుగు, ఉన్న వేతనాలనే ఇవ్వకుండా అరిగోసపెడుతున్నదని విమర్శించారు. ఇప్పటికైనా పెండింగ్‌లోని వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే బీఆర్టీయూ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంజుల, ఉపాధ్యక్షురాళ్లు లక్ష్మి, వాణి, రేణుక, కోశాధికారి స్వరూప, కార్యదర్శులు మంజుల, నాగమ్మ, మహేశ్వరి, కల్పన, రబియా, సమత, లలిత, బొల్గం పద్మ తదితరులు పాల్గొన్నారు.