Congress | హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): నిరసనలు, తిరుగుబాట్లు, అడ్డగింతలతో దేవాదుల సొరంగాల పేలుళ్ల నుంచి బయటపడిన రామప్పను, ఇప్పుడు మైనింగ్ భూతం వణికిస్తున్నది. నాడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు కోసం ఆల య సమీపం నుంచి సొరంగం తవ్వేందుకు చేసిన యత్నాలను ‘నమస్తే తెలంగాణ’ నిలువరించింది. 2011లో పత్రిక ప్రారంభమైన నెల రోజులకే ‘రామప్పకు జలయజ్ఞంతో ముప్పు’ శీర్షికన ప్రచురించిన కథనం స్ఫూర్తిగా పాలంపేట నుంచి వరంగల్ మీదు గా హైదరాబాద్ దాకా సుదీర్ఘ ఉద్యమమే కొనసాగింది. తెలంగాణ బుద్ధిజీవులు, సాంస్కృతిక, శిల్పకళాకారులు, చరిత్రకారులు, పురాతత్వవేత్తలు, ప ర్యావరణ వేత్తలు ఏకమై ఉద్యమించారు. సరిగ్గా అలాంటి ఉపద్రవమే మరోటి ముంచుకొచ్చింది. నాడు జలయజ్ఞం రూపం లో.. నేడు ఓపెన్ కాస్టు రూపంలో రామప్పను ప్ర మాదం వెంటాడుతూనే ఉన్నది. అప్పుడూ.. ఇప్పుడూ తెలంగాణ ఆత్మలేని కాంగ్రెస్ సర్కారే పాలనలో ఉండటం గమనార్హం.
అది 2011. దేవాదుల ప్రాజెక్టు పనులు ఎనిమిది, తొమ్మిదేండ్లుగా సాగుతున్నా ఒక ఎకరానికీ నీళ్లివ్వలేదు. దేవాదుల సొరంగం పనుల్లో భారీ పేలుళ్ల వల్ల రామప్ప గుడికి ముప్పు పొంచి ఉన్నదని ‘నమస్తే తెలంగాణ’ అధ్యయనంలో తేలింది. ‘జలయజ్ఞంతో రామప్పకు ముప్పు’ ‘చారిత్రక వాకిలి పొకిలి’ అని జూలై 24, 2011న మెయిన్, టాబ్లాయిడ్ మొదటి పేజీల్లో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ఉద్యమకారుల చేతిలో పాశుపతాస్త్రమైంది. రామప్ప పరిరక్షణ సమితి అనే సంస్థ పురుడు పోసుకునేలా చేసింది.
నమస్తే తెలంగాణ వరుస కథనాలకు దిగొచ్చిన నాటి పాలకులు ఎన్జీఆర్ఐతో పూర్తి స్థాయి విచారణ చేయించాలని నిర్ణయించారు. ఎన్జీఆర్ఐ మాత్రమే కాకుండా సెంట్రల్ మైన్స్ అండ్ ఫ్యుయెల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూల్ (సీఐఎంఎస్ఆర్), రాక్ యాక్సిలరేషన్ అండ్ మైనింగ్ ఇంజినీరింగ్ విభాగం, ఐఐటీ హైదరాబాద్, ఎస్ఐటీ వరంగల్, నాగ్పూర్ మైనింగ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎస్ఎంఆర్ఎ) లాంటి జాతీయ, అంతర్జాతీయ ప్రతిష్ఠాత్మక పరిశోధనా సంస్థలన్నీ ‘నమస్తే తెలంగాణ’ కథనాలన్నీ అక్షరసత్యాలని నిగ్గుతేల్చాయి. ‘విచారణ పూర్తయి నివేదిక ఇచ్చేంత వరకు పనులు నిలిపివేయండి’ అంటూ విధిలేని పరిస్థితుల్లో సరారు నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి నెలకొన్నది. ఎన్జీఆర్ఐ దశలవారిగా అధ్యయనం చేసి 2,500 పేజీల నివేదికను ప్రభుత్వానికి అందించింది. దేవాదుల సొరంగంతో ‘రామప్ప గుడికి ముప్పే’ అని శాస్త్రీయ అధ్యయనాలు తేల్చడంతో నాటి రాష్ట్ర నీటి పారుదల శాఖ సొరంగ మార్గం అలైన్మెంట్ మార్చింది.
2012లోనూ రామప్ప సమీపంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓపెన్ కాస్ట్ మైనింగ్ కోసం ప్రయత్నాలు చేసింది. అప్పట్లో పెద్ద ఎత్తున చరిత్రకారులు, పురావస్తు పరిశోధకుల నుంచి నిరసన వ్యక్తమవడం, ప్రజలు ఆందోళన చేయడంతో వెనక్కి తగ్గింది. ఇప్పుడు కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాగానే మైనింగ్నూ వెంటపెట్టుకొచ్చింది.