హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు బుధవారం హైకోర్టుకు హాజరయ్యారు. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న సమయంలో ఆయనపై ఈ కేసు నమోదైంది. సూర్యాపేట జిల్లాలో నీటిపారుదల శాఖలో పనిచేస్తున్న ఇద్దరు పార్ట్‌టైమ్ స్వీపర్లు ఇంక్రిమెంట్లతోపాటు కనీస వేతనం చెల్లించాలని కోరుతూ 2018లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పిటిషనర్లకు కనీస వేతనాలు చెల్లించాలని 2023లో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ ఈవీ వేణుగోపాల్ విచారణ జరిపి.. కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రతివాదిగా ఉన్న అప్పటి ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, ప్రస్తుతం సీఎస్‌ను కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. ఆయన బుధవారం హైకోర్టు విచారణకు హాజరయ్యారు. దీంతో కోర్టు ధిక్కార పిటిషన్ విచారణ ముగిసింది.