రామడుగు, ఆగస్టు 3 : వంతెన నిర్మాణానికి భూముల ఇచ్చిన తమనే దొంగల్లాగా అరెస్టు చేస్తారా? అని కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రానికి చెందిన రైతులు కడారి వీరయ్య, మొగిలి కనకయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘మేం రౌడీలమా, గూండాలమా.. పొలాల్లో పని చేసుకుంటున్న మమ్మల్ని రామడుగు పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి పోలీస్‌స్టేషన్‌లో బంధించారు’ అంటూ వాపోయారు. భూములిచ్చిన పాపానికి కాంగ్రెస్ సర్కారు తమను పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించిందని ఆవేదన వ్యక్తంచేశారు. రామడుగు శివారులోని వాగుపై శిథిలావస్థకు చేరుకున్న వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మించడానికి మండల కేంద్రానికి చెందిన రైతులు కడారి వీరయ్య, మొగిలి కనకయ్య తమ భూములు ఇచ్చారు. వాటికి సంబంధించిన పరిహారాన్ని ప్రభుత్వం ఇప్పటికీ చెల్లించలేదు.
ఆదివారం రామడుగు మండలంలో రాష్ట్ర మంత్రుల పర్యటన సందర్భం గా పోలీసులు ముందస్తుగా వీరయ్య, కనకయ్యను అరెస్టు చేసి రామడుగు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 2024 సెప్టెంబర్ 9న ప్రస్తుత ఎమ్మె ల్యే మేడిపల్లి సత్యం తమ వద్దకు వచ్చారని, మండల ప్రజల రాకపోకలకు ఇబ్బంది అవుతుందని, కలెక్టర్‌తో మాట్లాడి పరిహారం వచ్చేలా చేస్తామని చెప్పి రోడ్డు మరమ్మతులు చేయించారని గుర్తుచేశారు. ఎమ్మెల్యే హామీ ఇచ్చి ఏడాది గడుస్తున్నా ఇంతవరకు పరిహారం అందలేదని, ఎమ్మెల్యే, కలెక్టర్ చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా పరిహారం అందించకపోగా భూములు ఇచ్చిన తమని దొంగల్లా అరెస్టు చేసి అన్ని స్టేషన్లకు తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పరిహారం ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేస్తామని స్పష్టంచేశారు.