హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ యాక్ట్ (నరేగా) ఉపాధి హామీ పథకంపై కాంగ్రెస్ పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తున్నదని, నిరసన పేరిట బీజేపీ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ నాయకులు ధర్నాలు చేస్తే తాట తీస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హెచ్చరించారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం ఎన్టీఆర్ పేరిట ఉన్న శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రాజీవ్‌గాంధీ పేరు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం తప్పు కాదని స్పష్టంచేశారు. గతంలో 100 రోజులు ఉన్న ఉపాధి పనులను కొత్త ‘నరేగా’ పథకంలో 125 రోజులకు పెంచినట్టు వివరించారు. రాజకీయ లబ్ధి కోసమే గాంధీ పేరును కాంగ్రెస్ వాడుకుంటున్నదని విమర్శించారు. అబద్ధాలను ప్రచారం చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని మండిపడ్డారు.