Jammu Kashmir | కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో పాటు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ను బీజేపీ అధిష్ఠానం జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జీలుగా నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. జమ్మూ కశ్మీర్లో మూడు దశలు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. సెప్టెంబర్ 18న తొలి దశ, 25న రెండోదశ, అక్టోబర్ ఒకటిన మూడో దశ ఎన్నికలు జరుగనుండగా.. అక్టోబర్ 4న ఫలితాలు వెల్లడవనున్నాయి. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటన విడుదల చేశారు.
జమ్మూ కశ్మీర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలను ఎన్నికల ఇన్‌చార్జీలుగా నియమించారని.. నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. మాధవ్ 2014-20 కాలంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. జమ్మూ కశ్మీర్, అసోం, ఇతర ఈశాన్య రాష్ట్రాల రాజకీయ వ్యవహారాలను నిర్వహించే బాధ్యత ఆయనది. సెప్టెంబర్ 26, 2020న పునర్వ్యవస్థీకరణలో భాగంగా బీజేపీ ఆయనను ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించింది.