హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ) : వైశాఖ పున్నమి రోజైన మే 5న నాగార్జునసాగర్ బుద్ధవనంలో బుద్ధుడి 2,567వ జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్టు బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. నవయాన బౌద్ధం పునరుజ్జీవనానికి అంబేద్కర్ ముఖ్యకారకులని తెలిపారు. ఈ ఏడాది ఆ మహనీయుడి 125 అడుగుల విగ్రహాన్ని ప్రభుత్వం ఆవిష్కరించటంతోపాటు సచివాలయానికి ఆయన పేరు పెట్టి రాజ్యాంగస్ఫూర్తికి తెలంగాణ పునరంకితమైందని తెలిపారు. బుద్ధజయంతి సందర్భంగా హుస్సేన్‌సాగర్‌లోని 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం నుంచి బుద్ధవనం వరకు 200 కార్లతో మహార్యాలీని నిర్వహించనున్నామని వెల్లడించారు. ‘బౌద్ధ తాత్వికత, సమాజ జాతీయసమ్మిళిత భారత ప్రజాస్వామ్యం’ అనే అంశంపై యూజీసీ మాజీ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ థోరట్ ప్రసంగిస్తారని పేర్కొన్నారు. బిక్కు సంఘపాల దమ్మ తన ప్రవచనంలో బుద్ధపూర్ణిమ విశిష్టతను వివరిస్తారని తెలిపారు. కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్, క్రీడా సాంస్కృతికశాఖ మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్‌గౌడ్, హోం మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే నోముల భగత్, హర్యా నా ముఖ్యకార్యదర్శి రాజశేఖర్ ఉండ్రు, పర్యాటకాభివృద్ధి సం స్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్‌యాదవ్, పర్యాటకశాఖ ము ఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఎండీ మనోహర్, బౌద్ధ అభిమానులు పాల్గొననున్నారని తెలిపారు.