వనపర్తి టౌన్, మే 25 : పెద్దమందడిలో బీఆర్ఎస్ మీడియా సెల్ నాయకులపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం రాత్రి వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం దొడగుంటపల్లికి చెందిన సురేశ్, జంగమాయిపల్లికి చెందిన కొండన్నను ఎస్సై శివకుమార్ అక్రమంగా స్టేషన్లోనే నిర్బంధించడాన్ని నిరసిస్తూ ఆదివారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరజన్రెడ్డి ఆధ్వర్యంలో ఆయన స్వగృహం నుంచి రాజీవ్‌చౌక్, కొత్త బస్టాండ్ మీదుగా ఎస్పీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎస్పీ రావుల గిరిధర్‌కు వినతిపత్రం అందజేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ మాట్లాడుతూ.. పెద్దమందడి మండలంలో స్థానిక గ్రూపుల్లో సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ శ్రేణులు వ్యక్తిగత దూషణలు చేయగా బీఆర్ఎస్ కార్యకర్తలు దానికి సమాధానాలు మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. పోలీసులు అధికార పక్షానికి వత్తాసు పలుకుతూ బీఆర్ఎస్ శ్రేణులపై అక్రమ కేసులుపెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలకు పాల్పడిన వారెవరైనా ఉపేక్షించవద్దని, పోలీస్ సిబ్బందిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తల అక్రమ అరెస్టులను నిరసిస్తూ పెద్ద మందడి పోలీస్‌స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. అంతకు ముందు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తంచేశారు.