నర్సాపూర్, డిసెంబర్ 27 : రూ.100 కోట్లు ఖర్చుపెట్టి మనుమడితో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడటానికి సీఎం రేవంత్‌రెడ్డి వద్ద డబ్బులు ఉంటాయి కాని, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి డబ్బులు ఉండవా అని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ప్రశ్నించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో డబుల్ బెడ్ రూం ఇండ్లను అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని, నిర్మాణంలో ఉన్న 248 ఇండ్లను పూర్తి చేయాలని సునీతాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో శనివారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలన మూడేండ్లకు వచ్చినా ఇండ్లు ఇవ్వడం లేదని తెలిపారు. పేదలు ఆత్మగౌరవడంతో బతకాలని 2017లో అప్పటి సీఎం కేసీఆర్ నర్సాపూర్‌కు 500 డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేశారని తెలిపారు. మొదటి ఫేజ్‌లో 27 బ్లాకుల్లో ఒక్కో బ్లాకుకు 12 చొప్పున మొత్తం 252 ఇండ్లు పూర్తి చేసినట్టు వెల్లడించారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులకు ఓటుతో బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. అనంతరం డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం నుంచి నర్సాపూర్ చౌరస్తా వరకు లబ్ధ్దిదారులతో భారీ ర్యాలీ చేపట్టి రాస్తారోకో చేశారు.