హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): ఒకటో తేదీన ప్రభుత్వ చిరుద్యోగుల వేతనాలు ఇస్తున్నామన్న ప్రభుత్వ మాటలు ఉత్తిమాటలేనని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి విమర్శించారు. కొన్ని శాఖల్లోని చిరుద్యోగులకు నెలలుగా వేతనాలు అందడం లేదని, కనీసం ఆగస్టు 15 నాటికైనా వేతనాలు చెల్లించాలని, ఒక నెత వేతనం బోనస్‌గా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ డీఏలు, పీఆర్సీలను అమలు చేయాలని కోరారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ సిబ్బంది పరిస్థితి దయనీయంగా మారిందని, ఏడు నెలల నుంచి వారికి జీతాలే రావడం లేదని ధ్వజమెత్తారు. మధ్యాహ్న భోజన సిబ్బందికి ఏడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, మాడల్ సూల్ టీచర్లకు జీతాలు ఇవ్వడమే లేదని తెలిపారు. జూనియర్ కళాశాలల అధ్యాపకులు, డిగ్రీ కాలేజీ గెస్ట్ లెక్చరర్లు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.
జీతాలు పెంచాలని ఆశ వరర్లు కొన్నిరోజులుగా ఆందోళనలు చేస్తున్నారని చెప్పారు. చిరుద్యోగులంటే ప్రభుత్వానికి చిన్నచూపుగా మారిందని, సీఎం రేవంత్‌రెడ్డికి పాలనపై పట్టు రాలేదని ధ్వజమెత్తారు. మంత్రులకు తమ శాఖల బాధ్యతలే తెలియదని, మార్పు అంటూ కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. చిరుద్యోగుల వేతనాల విషయంలో ప్రభుత్వం స్పందించకుంటే వారి పక్షాన కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు.