హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): ఊరూరా తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన నిరుద్యోగులే ఆ పార్టీని గద్దెదింపుతారని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి హెచ్చరించారు. నిరుద్యోగులు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతిబిడ్డకు తెగింపు, తెగువ ఉంటాయని, అణచివేయాలని చూస్తే అగ్గి పుట్టిస్తామని హెచ్చరించారు. తక్షణమే వారి డిమాండ్లను నెరవేర్చడానికి చర్చలు జరపాలని సూచించారు.
ఆదివారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగుల వెనుక బీఆర్ఎస్ ఉండి కుట్రలు చేస్తున్నదంటూ ముఖ్యమంత్రి ఆరోపించడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. సీఎం వ్యాఖ్యలు చీప్‌గా ఉన్నాయని, ఆయన స్థాయికి తగ్గట్టుగా లేవని మండిపడ్డారు. నిరుద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడటం తగదని హితవు పలికారు. నాడు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల కోసం మాట్లాడితే ఉద్యమం.. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే కుట్రనా? అని నిలదీశారు.
అశోక్‌నగర్‌లో జరిగిన నిరసన నిరుద్యోగుల చైతన్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. నిరుద్యోగులు తిన్నది అరగక దీక్షలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మాట్లాడటం తగదని మండిపడ్డారు. మోతీలాల్‌నాయక్, బక జడ్సన్, అశోక్ ఆమరణ నిరహార దీక్షలు చేస్తే వాళ్లు ఏం పరీక్షలు రాశారని సీఎం అనడం ఏమిటని ఆగ్రహం వ్యక్తంచేశారు.
2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంపై కొట్లాడిన రేవంత్‌రెడ్డి నాడు ఏ పరీక్ష రాశారో చెప్పాలని నిలదీశారు. నీట్ గురించి మాట్లాడిన రాహుల్‌గాంధీ ఆ పరీక్ష రాశారా? అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు బీఆర్ఎస్ మద్దతు కచ్చితంగా ఉంటుందని స్పష్టంచేశారు. పంచాయతీ కార్మికులు, 108 సిబ్బంది ఎవరు పోరాటం చేసినా మద్దతు ఇస్తామని తెలిపారు.
గ్రూప్-2కు డీఎస్సీకి ఒక్కరోజే తేడా
గ్రూప్-2 పరీక్షకు, డీఎస్సీ పరీక్షకు ఒకరోజు మాత్రమే తేడా ఉన్నందునే డీఎస్సీకి ప్రిపేర్ అయ్యేవాళ్లు వాయిదా వేయాలని కోరుతున్నారని రాకేశ్‌రెడ్డి చెప్పారు. డీఎస్సీ, గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని కోరిన కోదండరాం కూడా అజ్ఞానా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తున్నదని, ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు కవాతు చేస్తున్నారని మండిపడ్డారు.
జర్నలిస్టులపై పోలీసులు దాడులు చేస్తున్నారని, రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలు అదుపు తప్పాయని విమర్శించారు. ‘రేవంత్‌రెడ్డిది ప్రజాపాలన కాదు. పోలీసుల పాలన, పరిపక్వత లేని పాలన. పైశాచిక పాలన, పైరవీల పాలన’ అని ధ్వజమెత్తారు. ప్రజాపాలన అని చెప్తున్న రేవంత్‌కు ఇంత పంతం ఎందుకు? అని నిలదీశారు.