హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): సర్కారు నిర్లక్ష్యం ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు గోసరిల్లుతున్నారని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు ధాన్యం కొనుగోళ్లు కాక, మరోవైపు పత్తి ధర పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఇవేమీ పట్టని పాలకులు మాత్రం ఫొటోలకు పోజులు కొడుతూ రీల్స్ చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వరికోతలు ప్రారంభమై 40 రోజులు దాటినా ఇంకా ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదని మండిపడ్డారు. రూ.10 ఉన్న మిల్లర్ చార్జీలను రూ.40 నుంచి 50కి పెంచుతామని చెప్పి ఇప్పుడు తీరా సమయానికి బేరాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.
ఇప్పటికే నల్లగొండ, సూర్యాపేట, జనగామ ప్రాంతాల్లోని ధాన్యాన్ని ఆంధ్రా మిల్లర్లు తక్కువ ధరకే కొంటున్నారని విమర్శించారు. క్వింటా పత్తి మద్దతు ధర రూ.7,521 ఉంటే రాష్ట్రంలో 5 వేల నుంచి 6 వేలకు కూడా అమ్ముడుపోయే పరిస్థితి లేదని మండిపడ్డారు. గుజరాత్లో క్వింటా పత్తి 8 వేల నుంచి 8,500కు కొంటున్నారని, తెలంగాణలో నాణ్యమైన పత్తికి ఆ రేటు ఇవ్వడం లేదని తెలిపారు. ఈ విషయంపై కేంద్రాన్ని అడిగే దమ్ము సీఎం రేవంత్‌రెడ్డికి ఎందుకు లేదని ప్రశ్నించారు.