హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): ‘దేశవ్యాప్తంగా బీసీలపై అన్నివిధాలా వివక్ష కొనసాగుతున్నది. దేశ జనాభాలో 60శాతం ఉన్న బీసీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీరని అన్యాయం చేస్తున్నాయి’ అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఒక ప్రకటనలో విమర్శించారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 80 ఏండ్లు కావస్తున్నా, రాజ్యాధికారంలో బీసీలకు సరైన వాటా దక్కకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఇప్పటికీ అనేక బీసీ కులాల నుంచి చట్టసభల్లో కాలు కూడా పెట్టకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. బీసీలపై సామాజిక, ఆర్థిక, రాజకీయ వివక్ష కొనసాగుతుండటం ఆవేదన కలిగిస్తున్నదని ఆయన తెలిపారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్యా, ఉద్యోగరంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, ప్రతి వార్షిక బడ్జెట్లో రూ.20,000 కోట్లు కేటాయిస్తామని శాసనసభ ఎన్నికలకు ముందు కామారెడ్డి బహిరంగసభలో ఆర్భాటంగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పూర్తిగా ఆ హామీలనే విస్మరించిందని తెలిపారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను కేంద్రానికి పంపి చేతులు దులుపుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నదని ఆరోపించారు. బీజేపీ సర్కారు బీ సీ బిల్లులను తెలంగాణ అంశంగా చూస్తూ స్పందించడం లేదని పేర్కొన్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్ హడావుడి
ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్తోపాటు బీసీ వర్గాలు ఒత్తిడిని పెంచడంతో కాంగ్రెస్ పాలకులు ఢిల్లీలో హడావుడి చేస్తున్నారని విమర్శించారు. ధర్నాలు, ప్రెస్మీట్ల వల్ల బీసీలకు రాజ్యాధికారం రాదని, ప్రధాని మోదీని ఒప్పించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలైన సోనియా, రాహుల్ నేతృత్వంలో అఖిలపక్షాన్ని తీసుకెళ్లడమే ఉత్తమమైన మార్గమని అభిప్రాయపడ్డారు. ఇండియా కూటమికి లోకసభ, రాజ్యసభల్లో 300 మందికి పైగా సభ్యులున్నారని, బీసీ బిల్లుకు సునాయసంగా ఆమోదం లభిస్తుందని, దీనికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు.