ఖైరతాబాద్, జూన్ 18 : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆర్నెళ్లవుతుందని, కానీ ఒక్క మౌలిక మార్పు కనిపించడం లేదని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. మంగళవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన నిరుద్యోగ జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అనేక ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉన్నాయని, వాటిని ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. ఉపాధ్యాయ పోస్టులతో పాటు గ్రూప్ 1, 2, 3, 4లో పోస్టులు పెంచాలని, 23 కొత్త జిల్లాలు, 30 డివిజన్లలో పోలీస్స్టేషన్లు, గ్రామపంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పటివరకు ఏ ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదని తెలిపారు. రాష్ట్రంలో 5,900 ఎయిడెడ్ పోస్టులు ఉన్నాయని, వాటిని పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలకు తలొగ్గి అడ్డగోలుగా పదోన్నతులు ఇచ్చి నిరుద్యోగుల పొట్టకొడుతున్నారని మండిపడ్డారు. విద్యార్థులు చదువుతో పాటు ప్రభుత్వ వైఖరిపై పోరాటాలను నేర్చుకోవాలని సూచించారు. ఈ నెల 20న ఇందిరాపార్కు వద్ద నిర్వహించే నిరుద్యోగ ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో యూత్ ఎంప్లాయిమెంట్ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. వంద రోజుల్లో 20వేల పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ నీల వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి అన్వర్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏ రామకోటి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.