హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీకి అభ్యర్థులే దొరకడం లేదని ఎద్దేవా చేశారు. మూ డోసారి సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. మంగళవారం హైదరాబాద్లో బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్కు లభిస్తున్న ఆదర ణను చూసి కాంగ్రెస్, బీజేపీ తట్టుకో లేక పోతున్నాయని విమర్శించారు. ప్రజలపై ఉన్న నమ్మకంతోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందుగానే అభ్య ర్థులను ప్రకటించారని, దేశంలో మరే రాజకీయ పార్టీ ఇలాంటి సాహసం చేయలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ కార్డుతో మరోసారి ఆ వర్గాలను మోసం చేయాలని చూస్తున్నదని దుయ్యబట్టారు. దళితుల జీవితాలను మార్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నదని, దళితబంధు అందులో మేలిమి బంగారమని పేర్కొన్నారు. దశాబ్దాలుగా పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని గిరిజనులు కోరుతున్నా ఎవరూ పట్టించుకున్న పాపానపోలేదని, ఏకకాలంలో 4.5 లక్షల ఎకరాలపై గిరిజనులకు అటవీ భూ యాజమాన్య హక్కులు కల్పించి కేసీఆర్ చరిత్ర సృష్టించారని చెప్పారు. కాంగ్రెస్ను దళితులు, గిరిజనులు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మరని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలకు స్వతహాగా ఆలోచించే సామర్థ్యం లేదని, పథకాల రూపకల్పన సైతం కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు.