Jogulamba Gadwal | మహబూబ్నగర్ : అన్నదాతలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతూనే ఉంది. లగచర్ల రైతులకు బేడీలు వేసినట్టే.. రాజోలి రైతులకు కూడా సంకెళ్లు వేశారు. రైతన్నల పట్ల రేవంత్ సర్కార్ క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. మహబూబ్నగర్ జైలు నుంచి అలంపూర్ కోర్టుకు రైతులకు బేడీలు వేసి తరలించారు. ఈ దృశ్యాలు మీడియాకు చిక్కాయి. ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పోలీసుల తీరును ఎండగడుతున్నారు ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులు.
పెద్ద ధన్వాడలో ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన చేసిన 12 మంది అన్నదాతలపై పోలీసులు కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. ఇవాళ రిమాండ్ ముగియడంతో.. వారిని మహబూబ్నగర్ కోర్టు నుంచి అలంపూర్ కోర్టులో హాజరు పరిచేందుకు పోలీసులు తీసుకెళ్లారు. అయితే రాజోలి రైతులకు సంకెళ్లు వేసి అలంపూర్ కోర్టులో హాజరు పరచడం.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నేరస్తుల లాగా రైతులకు బేడీలు వేసి కోర్టులో హాజరుపరచడాన్ని అన్నదాతలు తప్పుబడుతున్నారు.
ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లిన 12మంది రైతులకు నిన్ననే బెయిల్ మంజూరైంది. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్ద ధన్వాడ శివారులో ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేయొద్దని పోరాటం చేసిన ఘటనలో 12 మంది రైతులను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 4న జైలుకెళ్లిన వీరికి 14 రోజుల తర్వాత కండీషన్ బెయిల్ మంజూరైంది. బెయిల్ వచ్చాక కూడా రైతులకు బేడీలు వేయడం ఎంతవరకు సమంజసం అని బీఆర్ఎస్ నేతలు మండి పడుతున్నారు.