హైదరాబాద్: హైదరాబాద్‌లో హైడ్రా (HYDRAA) మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారంలో అక్రమ నిర్మాణాలు, కబ్జాలు చేసిన కట్టిన నిర్మాణాలను హైడ్రా (HYDRAA Demolitions) అధికారులు కూల్చివేస్తున్నారు. దాదాపు 300 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించారు. 60 నుంచి 70 గజాల్లో ఇళ్లను నిర్మించి రూ.10 లక్షల చొప్పున విక్రయిస్తున్నారు. దీనిపై హడ్రాకు స్థానికులు ఫిర్యాదులు చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. సుమారు రూ.15 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణదారుల చేతుల్లో ఉన్నట్లు గుర్తించారు. కబ్జాలను నిర్ధారించుకుని ఆదివారం ఉదయం నుంచి తొలగింపు నులు చేపట్టారు. నివాసాల జోలికి వెళ్లకుండా ఆక్రమణలను తొలగిస్తున్నారు. సర్వే నంబర్ 397లో 300 ఎకరాలకు పైగా ఉన్న భూమిలో నిర్మించిన అక్రమ ఇండ్లను కూల్చివేస్తున్నారు. అనంతరం దానికి కంచె వేయనున్నారు.
మరోవైపు కూల్చివేతలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. తామంతా డబ్బులకు ఇండ్లను కొనుక్కున్నామని, వాటిని అమ్మిన వాళ్లపై చర్యలు తీసుకోవాలంటూ చిన్న పిల్లలతో కలిసి జేసీబీలకు అడ్డుగా నిల్చొని నిరసన తెలిపారు. దీంతో పోలీసులు, హైడ్రా సిబ్బంది వారిని అక్కడి నుంచి పంపించి కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, టీజీఐఐసీ, హెచ్ఎండీఏ, హౌసింగ్‌బోర్డు విభాగాలకు దశాబ్దాల క్రితం అప్పటి ప్రభుత్వాలు భూములిచ్చాయి. ఆయా విభాగాలు తమ కార్యకలాపాలు ప్రారంభించకపోవడంతో అక్రమార్కుల కన్ను వాటిపై పడింది. భూములను కబ్జాచేసి కుత్బుల్లాపూర్, గాజులరామారం, చింతల్ పరిసర ప్రాంతాల్లో పనులు చేసుకుంటున్న వారికి సింగిల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి అమ్మేస్తున్నారు. అక్రమార్కులకు అధికారులు తోడవడంతో ఆయా నివాసాలకు నల్లాలు, కరెంటు మీటర్లు వచ్చాయి. ఈ ప్రాంతాల్లో ఎకరా మార్కెట్ విలువ రూ.40 నుంచి 50 కోట్ల వరకు ఉంటుంది.
కాగా, గాజులరామారం కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Ranganath) స్పందించారు. రెవెన్యూ అధికారులు, పోలీసు సహాయంతో గాజులరామారంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు తొలగిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నవారిలో రియలెస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు ఉన్నారని చెప్పారు. ఆక్రమణలకు గురైన భూముల్లో 40 ఎకరాల్లో పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. అధికారులతో స్థానిక నేతలు కుమ్మక్కై 50, 100 గజాలుగా పేదలకు స్థలాలు విక్రయించారని వెల్లడించారు. 6 నెలల్లో ఐదారుసార్లు స్థానికులతో హైడ్రా, రెవెన్యూ అధికారులు మాట్లాడారని చెప్పారు.
కబ్జాలను తొలగించి ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పేదలు నివసిస్తున్న ప్రాంతాలను తొలగించట్లేదని, వాణిజ్య షెడ్లు, కాంపౌండ్ గోడలు, గదులు నిర్మించిన వాటినే కూల్చివేస్తున్నామన్నారు. కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకుని కంచె ఏర్పాటు చేస్తామన్నారు. ధనవంతులకు ఇచ్చిన కొన్ని పట్టాలు (ORCలు) నకిలీవని తేలిందని చెప్పారు. రూ.13 వేల కోట్ల విలువైన 275 ఎకరాలకుపైగా భూమిని స్వాధీనం చేసుకుంటామని వెల్లడించారు.