హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సాధారణంగా తమ ప్రభుత్వ వైఫల్యాలపై బహిరంగంగా క్షమాపణలు చెప్పేందుకు ఇష్టపడరు. అలా చెప్పాల్సిన పరిస్థితి రావడాన్ని నామోషీగా భావిస్తారు. అంతా సవ్యంగానే ఉన్నదని, ప్రతిపక్షాలే రాద్ధాంతం చేస్తున్నాయని బుకాయిస్తారు. అందుకు భిన్నంగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని అంగీకరిస్తూ రైతులకు క్షమాపణ చెప్పారు.
అంతేకాదు, ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న పోరాటాలను కూడా స్వాగతిస్తున్నామని స్పష్టంచేశారు. ఇలా తమ సొంత పార్టీ ఎమ్మెల్యేయే తమ ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడే పరిస్థితి వచ్చినందుకు నిజానికి ఏ ప్రభుత్వమైనా సిగ్గుపడాలి. సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యేనే ప్రభుత్వ తీరుపై అసహనం, అసంతృప్తి వ్యక్తంచేస్తుంటే, బాధితవర్గాలు మరింత ఆగ్రహంతో ఉం టాయో అర్థం చేసుకోవచ్చు. కానీ, బాధిత వర్గాల నుంచి, ప్రజల నుంచి వచ్చే ఇలాంటి ఆగ్రహాలను ప్రభుత్వం సహించలేకపోతున్నది.
ఇందుకు ఉదాహరణ బస్సు డ్రైవర్ అశోక్ ఉదంతమే. ‘ధాన్యం, మక్క లు కొనండి.. మహాప్రభో..’ అన్నందుకు ఆయన ఉద్యోగమే పీకేసింది ప్రభుత్వం! కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జగిత్యాలలో ర్యాలీ నిర్వహించారు. అదే సమయంలో ఆర్టీసీ అద్దె బస్సు అటుగా వచ్చింది. బస్సు డ్రైవర్ అశోక్ ధర్నాను గమనిస్తూ.. ‘ముందు ధాన్యం, మకలు కొనండి’..అని వ్యాఖ్యానించారు.
అంతే సదరు డ్రైవర్ మీద ప్రభుత్వానికి కోపం వచ్చింది! తమ సొంత పార్టీ ఎమ్మెల్యే ధాన్యం కొనుగోళ్ల తీరుపై చేసిన వ్యాఖ్యలను ఏమాత్రం సీరియస్‌గా తీసుకోని ప్రభుత్వం.. ఒక సాధారణ డ్రైవర్ చేసిన వ్యాఖ్యలపై మాత్రం కన్నెర్ర జేసింది. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అన్నట్టుగా డ్రైవర్ అశోక్‌పై ఆర్టీసీ యాజమాన్యం సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన్ను విధుల్లోకి రావొద్దని రీజినల్ మేనేజర్ రిమూవల్ లెటర్ పంపించారు. కానీ, అదే మాట అన్న సొంత పార్టీ ఎమ్మెల్యే మీద ఎలాంటి చర్యలు లేవు. దీనిపై ప్రజలు మండిపడుతున్నారు.