వేములవాడ, అక్టోబర్ 16: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయంలో అత్యంత వైభవోపేతంగా నిర్మాణాలు చేపట్టాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గురువారం బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. దేశనలుమూలల నుంచి వచ్చే భక్తుల ఇలవేల్పుగా వెలుగొందుతున్న రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేయాలని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే రూ.30 కోట్లతో 30 ఎకరాలకుపైగా స్థల సేకరణతో అడుగులు పడ్డాయని అన్నారు. ఇప్పుడు చేపట్టబోయే అభివృద్ధి పనులు గత ప్రభుత్వంలో సేకరించిన భూముల్లోనే జరుగుతున్నాయని చెప్పారు.
ఆలయం చెరువును ఆనుకుని ఉన్నందున చెరువు విస్తీర్ణం తగ్గకుండా భూసేకరణ జరిగిందని, ఈ సందర్భంగా అభివృద్ధికి భూములు ఇచ్చిన రైతులకు చేతులెత్తి మొక్కుతున్నట్టు తెలిపారు. ఆలయాన్ని నాలుగు స్తంభాల సిమెంటు పిల్లర్లతో నిర్మించి, భక్తుల మనోభావాలను దెబ్బతీయవద్దని ప్రభుత్వానికి సూచించారు. స్వామివారి ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని అన్నారు. రాతి కట్టడాలతోనే నిర్మించాలని పేర్కొన్నారు. తమిళనాడు కృష్ణశిలతో అత్యంత వైభవంగా యాదగిరిగుట్ట తరహాలో రాజన్న ఆలయ నిర్మాణం జరిగేలా సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకోవాలని కోరారు. ఆలయ అభివృద్ధి పనులు ప్రజలకే తెలియలేని పరిస్థితిలో ఉన్నాయని విమర్శించారు. పనులను అడ్డుకుంటారనే ముందస్తుగా హైకోర్టులో కేవియట్ పిటిషన్ వేసినట్టు తెలిసిందని, పనులు సక్రమంగా చేపడితే ప్రజలు ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నించారు.
తెలంగాణ కుంభమేళగా రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరకు వచ్చే భక్తులు రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్నదని వినోద్‌కుమార్ తెలిపారు. అభివృద్ధి పేరుతో ఆలయాన్ని మూసివేస్తామని గందరగోళ ప్రకటన నేపథ్యంలో అనేకమంది భక్తులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. జాతర జనవరిలో ఉన్నందున ఈ రెండు నెలలు దర్శనం కల్పించాలని, శివరాత్రి వరకు యథావిధిగా దర్శనాలు కొనసాగించాలని డిమాండ్ చేశారు.