వేములవాడ, నవంబర్ 18: వేతనం రాక వైద్యం చేయించుకోలేని స్థితిలో వంట కార్మికురాలు గండెపోటుతో కుప్పకూలిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో 18 మంది మహిళలు అవుట్ సోర్సింగ్ పద్ధతిన రూ.13,500 వేతనంతో వంట కార్మికులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభు త్వం తొమ్మిది నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో అనారోగ్యంతో ఉన్నా.. దవాఖానకు వెళ్లలేని దీనస్థితి ఉందని వాపోతున్నారు.
వేములవాడ బల్దియా పరిధిలో బీసీ బాలికల వసతి సంక్షేమ గృహంలో 14 ఏండ్లుగా వంట కార్మికురాలుగా పనిచేస్తున్న సీహెచ్ మహేశ్వరి(50) మంగళవారం యథావిధిగా విధులకు హాజరై పని చేస్తుండగానే కుప్పకూలిపోగా.. తోటి కార్మికులు హుటాహుటిన ఏరియా దవాఖానకు తరలించగా గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. వారం రోజులుగా ఆయాసంతో బాధపడుతుండగా వైద్య పరీక్షలు చేయించుకోలేని దీనస్థితిలో ఉండటంతోనే ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోయిందని తోటి కార్మికులు ఆవేదన వ్యక్తంచేశారు.
తొమ్మిది నెలలుగా వేతనాలు రావడంలేదు. ఔట్సోర్సింగ్ పద్ధతిన ప్రతి రోజూ పని చేయాల్సి వస్తున్నది. ఉదయం 9 గంటల వరకే విద్యార్థులకు టిఫిన్ పెట్టి కళాశాలకు పంపాలి. పని ఒత్తిడి.. అనారోగ్య సమస్యలున్నా విధులు తప్పడం లేదు.
– భూక్యా రాజ్యమ్మ, వంట కార్మికురాలు (వేములవాడ)
వేతనాలు అందక పస్తులుంటాన్నాం. విద్యార్థులకు వంట చేసి కడుపు నింపుతున్నాం. వచ్చే అరకొర జీతమైనా నెలనెలా ఇస్తే బాగుండేది. తొమ్మిది నెలలుగా జీతాలు రాక బతుకులు ఆగమైతున్నయి. దసరా, దీపావళి పండగలు కూడా జరుపుకోలేదు. మా బతుకులు కుప్పకూలుతున్నాయి.
– రామంచ రేణుక, వంట కార్మికురాలు (వేములవాడ)