వేములవాడ, జూన్ 1: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి భక్తుల సమర్పించిన కోడెలను (Rajanna Kodelu) పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆదివారం నుంచి కోడెలను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఇప్పటికే ప్రకటన విడుదల చేశారు. మొదటి విడతలో 300 కోడెలను చిన్నవాటిని పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. జియో ట్యాగింగ్ కలిగి ఉన్న వాటిని రైతులకు అందజేస్తామన్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు.
రైతులు తప్పనిసరిగా పట్టాదార్ పాస్ పుస్తకం, ఆధార్ కార్డుతో అధికారులు సూచించిన https://rajannasircilla.telangana.gov.in/ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. రాజన్న ఆలయ గోశాలలో ప్రస్తుతం 1250 పైగా కోడెలు ఉండగా ఇకపై పకడ్బందీగా పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఇటీవల గోశాలలో కోడెలు మృతిచెందిన విషయం తెలిసిందే. శుక్ర, శనివారాల్లో 13 కోడెలు మృత్యువాతపడ్డాయి. ఈ నేపథ్యంలో తిప్పాపురంలోని గోశాలలో కోడెల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధచూపాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన గోశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోడెలకు అందిస్తున్న మేత, ఇతర పదార్థాల నాణ్యత, పరిసరాలను పరిశీలించారు. అకాల వర్షాలు, అనారోగ్య కారణాలతో 8 కోడెలు మృత్యువాతపడినట్టు తెలిపారు. కోడెల సంరక్షణను మరింత బాధ్యతగా చూసుకోవాలని, సరిపడా దాణా, పచ్చగడ్డి పెట్టాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.