స్టేషన్‌ఘన్‌పూర్, మార్చి 21: దేవాదుల పంప్‌హౌస్ మోటర్లను శనివారం లోగా ఆన్ చేసి ధర్మసాగర్ నుంచి స్టేషన్‌ఘన్‌పూర్ రిజర్వాయర్‌కు సాగునీరు అందించాలని మాజీ ఎమ్మెల్యే రాజయ్య డిమాండ్ చేశారు. లేకపోతే దేవన్నపేట పంప్‌హౌస్‌ను ముట్టడించి, రైతులతో పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తాటికొండ గ్రామంలోని మేకల వెంకటయ్య, గిద్దెబండ తండాలో బానోత్ రాముకు చెందిన ఎండిన పంటపొలాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. బాధిత రైతుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాజయ్య మాట్లాడుతూ సాగునీరు అందక మేకల వెంకటయ్యకు చెందిన 4 ఎకరాలు, గిద్దెబండ తండాలో బానోత్ రాముకు చెందిన 8 ఎకరాల పంట పొలం ఎండిపోయిందని ఆవేదన్య వ్యక్తంచేశారు.
ఒకే ఊరిలో ఎండిన 150 ఎకరాల పంట ; అడుగంటిన భూగర్భ జలాలు
ధర్మారం, మార్చి 21: ఒకే ఊరిలో సాగుచేసిన వరిపంట ఎండిపోయింది. ఆ ఊరిలో సుమారు 300 ఎకరాల్లో యాసంగి సీజన్లో రైతులు వరి పైరు సాగుచేశారు. దానిలో సుమారు 150 ఎకరాల్లో వరి పంట చేతికొచ్చే దశలో ఎండింది. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామ పరిధిలో అత్యధికంగా గిరిజన రైతులు సుమారు 300 ఎకరాల్లో వరి సాగు చేశారు. వరి నాట్లు వేసిన సమయంలో బావుల్లో భూగర్భజలాలు మెరుగ్గా ఉండగా, తీరా పంటలు చేతికొచ్చే దశలో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. దీంతో రైతులు వేల రూపాయలు పెట్టి క్రేన్ల ద్వారా పూడిక తీయించారు. అయినా ఊటలు రాలేదు. మరికొందరు రూ.లక్షలు వెచ్చించి పొక్లెయినర్లతో పూడిక తీస్తున్నారు. ఎంత లోతు తవ్వినా బావుల్లో చుకనీరు కనబడటం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీంతో సగానికి సగం పంటలు ఎండుతున్నాయి. కండ్లముందే పంటలు ఎండిపోవడంతో వాటిలో గొర్రెలు, పశువులను మేపుతున్నారు. ప్రభుత్వం ఎండిన పంటలకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. తమ గ్రామానికి సాగునీటిని అందించేందుకు నిర్మించతలపెట్టిన ఎస్సారెస్పీ ఉపకాల్వ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందని, దాని నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయించి పనులు చేపట్టాలని కోరుతున్నారు.