హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ) : ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక గిరిజనులు, మావోయిస్టులను హతమారుస్తూ కేంద్ర ప్రభుత్వం నరమేధానికి పాల్పడుతున్నదని, ఈ వైఖరిని విడనాడాలని అఖిలభారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ, కార్యదర్శి ధర్మేంద్ర డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 23న చలో రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు వారు ప్రకటించారు. బుధవారం ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో చలో రాజ్‌భవన్ కార్యక్రమ గోడ పత్రికను వారు విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతిచర్చలు జరపాలంటూ ప్రజాసంఘాల నేతలు, మావోయిస్టు ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసినా కేంద్రం పట్టించుకోకుండా మావోయిస్టులు, గిరిజనులను బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నదని మండిపడ్డారు. అడవుల్లోని సంపదను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయడానికే ఈ నరమేధాన్ని సృష్టిస్తున్నదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ పాల్గొన్నారు.