హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన రాజ్‌భవన్.. రాష్ట్ర బీజేపీ రెండో కార్యాలయంగా మారిందని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ మొదటి ఆఫీస్ నాంపల్లిలో ఉంటే, రాజ్‌భవన్ రెండో ఆఫీస్‌లా తయారయ్యిందని వ్యాఖ్యానించారు. ఎర్రగడ్డలోని టీఎస్ జెన్కో ఆడిటోరియంలో మంత్రి మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. విలేకరుల ప్రశ్నలపై స్పందించిన మంత్రి.. గవర్నర్ రాజకీయంచేస్తూ బీజేపీ కార్యకర్తలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా తాము మునుగోడులో గెలిచామని, ఆ ఓటమితో బీజేపీ నంబర్ వన్, నంబర్ టు ఆగమవుతున్నారని అన్నారు. ఓడిపోయిన అక్కసుతోనే మోదీ తెలంగాణ పర్యటనలో అడ్డగోలుగా మాట్లాడారని మండిపడ్డారు. తెలంగాణపై పెద్దస్థాయి వ్యక్తులు కుట్రలు చేస్తున్నారని, అయినా తెలంగాణ ప్రజల నుంచి కేసీఆర్‌ను విడదీయలేరని స్పష్టంచేశారు. తెలంగాణ పథకాలు గుజరాత్ వరకు వ్యాపించడంతోనే బీజేపీ అగ్రనేతలు వణుకుతున్నారని జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాకు ఆటంకం కలిగించేందుకు కేంద్రం కుట్రలు చేస్తున్నదని, సీఎం కేసీఆర్ ఉన్నంత వరకు రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాకు ఇబ్బందులు రానివని చెప్పారు.
అన్నం పెడుతున్న సంస్థను ప్రేమించాలి
విద్యుత్తు సంస్థల్లో కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారు అన్నం పెడుతున్న సంస్థను, పనిని ప్రేమించాలని మంత్రి జగదీశ్‌రెడ్డి సూచించారు. అంతకుముందు సీఎండీలు దేవులపల్లి ప్రభాకర్‌రావు, రఘుమారెడ్డితో కలిసి టీఎస్ఎస్పీడీసీఎల్లో కొత్తగా నియామకమైన 69 మంది అసిస్టెంట్ ఇంజినీర్లు, 178 మంది సబ్ ఇంజినీర్లకు మంత్రి నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినియోగదారులను తక్కువచేసి చూడొద్దని, వినియోగదారులే ఉద్యోగదాతలని గుర్తించాలని సూచించారు. ఉద్యోగాన్ని ఇష్టపడితే అర్ధరాత్రి అపరాత్రి అన్న తేడాల్లేకుండా పనిచేయగలుగుతామని సూచించారు.
22,774 ఆర్టిజన్లను శాశ్వత ఉద్యోగులుగా నియమించామని, 12 వేల మంది కొత్త వారిని రిక్రూట్ చేసుకున్నామని గుర్తుచేశారు. టీఎస్ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డి మార్గదర్శనంలో రూ.37 వేల కోట్లు వెచ్చించి తెలంగాణలో విద్యుత్తు వ్యవస్థలను పటిష్టం చేశామన్నారు. ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి సంస్థ సమగ్ర స్వరూపంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో విద్యుత్తు సంస్థల డైరెక్టర్లు జే శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్, స్వామిరెడ్డి, పర్వతం, మదన్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.