హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ‘చేతి’తో కమలం ఒదిగి చెట్టాపట్టాల్ వేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘కాంగ్రెస్ పార్టీతో రాష్ట్రంలోని మీ కమలం నేతలు కలిసికట్టుగానే పనిచేస్తున్నారు మోదీగారూ’ అంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ పేర్కొన్నారు. చోటే భాయ్‌కి వ్యూహకర్తగా, కాంగ్రెస్ కట్టర్ కార్యకర్తలుగా విశ్రమించకుండా పనిచేస్తున్నారని తెలిపారు. ‘చీకటి రాజకీయ ప్రయోజనాల కోసం చేయి కలుపుతూ చోటేభాయ్ కోసం కలిసి పనిచేస్తున్నారు. ఎన్ని అరాచకాలు జరిగినా ఒక రూ నోరుమెదపరు. రేవంత్ మీద ఈగ వాలకుండా కాపాడుకుంటారు’ అని పేర్కొన్నారు. ‘హైడ్రా మంచిదంటరు. మూసీ కా వాలంటరు. ఏమన్నా అంటే నిద్ర నటిస్తా రు. పిల్లలు చనిపోయినా, రైతు గుండె పగిలినా, గిరిజనులను చెరబట్టినా చప్పట్లు కొ డతారు. రాష్ట్రంలో వారి చేతిలోనే కమలం ఉన్నది జాగ్రత్త.. భద్రం’ అని కేటీఆర్ ఇరు పార్టీల నాటకీయతను బయటపెట్టారు.
బడిపిల్లలకు బాసటగా నిలిస్తే అరెస్ట్ చేస్తారా? పురుగుల అన్నం పెడుతున్నారని ప్రశ్నిస్తే కేసులు పెడ్తారా? అని ప్రభుత్వ వైఖరిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురుకుల సమస్యలపై, విద్యార్థుల ఆత్మహత్యలపై, పిల్లల మరణాలపై గళమెత్తితే గొంతు నొకుతారా? అని మండిపడ్డారు. బీఆర్ఎస్వీ నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికమని, వారిని తక్షణమే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
అబద్ధానికి అంగీ, లాగు తొడిగితే అది కాంగ్రెస్ సరార్ అని కేటీఆర్ ఆరోపించారు. రైతుభరోసాకు ఎగనామం పెట్టి, రుణమాఫీ పేరుతో దోఖా చేసి, పంటల కొనుగోళ్లకు శఠగోపం పెట్టి.. బోనస్ ఎగ్గొట్టిన దుర్మార్గ పాలన ఇదని మండిపడ్డారు. దిలావర్పూర్లో దమనకాండ సృష్టించి.. రామన్నపేటను రావణకాష్టం చేసి.. లగచర్ల రైతులను జైలుపాలు చేసి అల్లుడి కండ్లలో ఆనందం చూసినందుకా? పండుగలు మీకు-పస్తులు రైతులకు అనుకునే సర్కార్ తీరుపై విరుచుకుపడ్డారు. రైతులను ముంచినందుకు? వ్యవసాయాన్ని ఆగం చేసినందుకా విజయోత్సవాలు? అని ధ్వజమెత్తారు.