హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): వానకాలం సాగుకు వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ సీజన్లో 1.34కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా వరి 66 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేయగా ఆ తర్వాత పత్తి 60 లక్షల ఎకరాల్లో, మొక్కజొన్న 6 లక్షల ఎకరాల్లో, కంది 5.65 లక్షల ఎకరాల్లో, సోయాబీన్ 5 లక్షల ఎకరాల్లో, మిగిలిన పంటల్లో పెసర 56వేల ఎకరాల్లో, జొన్న 38వేల ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేసింది. గత వానకాలంలో 1.24కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేయగా 1.26 కోట్ల ఎకరాల్లో పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. గతేడాది సాగుతో పోల్చితే ఈ ఏడాది వానకాలంలో మరో 8 లక్షల ఎకరాల్లో అదనంగా పంటలు సాగవుతాయని అంచనా వేస్తున్నది. గత వానకాలంలో రికార్డు స్థాయిలో 65 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా పత్తి 44.77 లక్షల ఎకరాల్లో సాగైంది.
ఎరువులు, విత్తనాలపై దృష్టి
పంటల సాగుకు ప్రణాళిక సిద్ధం చేసిన వ్యవసాయ శాఖ అందుకు అవసరమైన ఎరువులు, విత్తనాలను సమకూర్చడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే మొత్తం పంటలకు సుమారు 19 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నది. ఇందులో వరి విత్తనాలు 16.5 లక్షల క్వింటాళ్లు, పత్తి 54వేల క్వింటాళ్లు అవసరం కానున్నాయి. మొత్తం 24.40 లక్షల టన్నుల ఎరువులు అవసరం అవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే కేంద్రంతో సంప్రదించి ఎరువుల కోటాను మంజూరు చేయించింది. మొత్తం ఎరువుల్లో అత్యధికంగా 10.40 లక్షల టన్నుల యూరియా, 10 లక్షల టన్నుల ఎన్పీకే, 2.40 లక్షల టన్నుల డీఏపీని సిద్ధం చేసింది. ఏ నెలలో ఏ ఎరువులను ఎంత మొత్తం పంపిణీ చేయాలో ప్రణాళిక రూపొందించింది. మే, జూన్ నెలల్లో అత్యధికంగా 4.60 లక్షల టన్నుల చొప్పున ఎరువులను పంపిణీ చేయనుంది. ప్రస్తుతం డీలర్లు, సొసైటీలు, మార్క్‌ఫెడ్‌తో పాటు గోదాముల్లో 11 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నట్టు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఎరువుల పంపిణీలో ఇబ్బందులు రాకుండా ఉండేందుకుగానూ మార్క్‌ఫెడ్ వద్ద 5 లక్షల టన్నుల యూరియాను బఫర్ స్టాక్ పెట్టాలని నిర్ణయించింది.