ఆరుగాలం కష్టించి పండించిన పంటాయె.. చేతికిన్ని కాసులొస్తే పూట గడుస్తదాయె.. అమ్ముద్దామని వడ్లు తీసుకెళ్లి కొనుగోలుకేంద్రంలో పోసి నాలుగు రోజులు ఎండబెడితే.. ఎట్టకేలకు శనివారం వడ్లు కాంటా వేశారు.. వడ్లు లోడు ఎత్తమే ఇక మిగిలింది.
Telangana | నమస్తే తెలంగాణ నెట్వర్క్: ఆరుగాలం కష్టించి పండించిన పంటాయె.. చేతికిన్ని కాసులొస్తే పూట గడుస్తదాయె.. అమ్ముద్దామని వడ్లు తీసుకెళ్లి కొనుగోలుకేంద్రంలో పోసి నాలుగు రోజులు ఎండబెడితే.. ఎట్టకేలకు శనివారం వడ్లు కాంటా వేశారు.. వడ్లు లోడు ఎత్తమే ఇక మిగిలింది. ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారి వాతావరణం మారింది. వడ్లబస్తాలు తడుస్తాయని భయపడిన రైతు టార్ఫాలిన్లు కప్పుదామని తన మనుమడిని వెంటబెట్టుకొని కొనుగోలు కేంద్రానికి వెళ్లాడు. వాళ్లు వడ్ల బస్తాలపై టార్ఫాలిన్ కప్పుతుండగా పిడుగుపడటంతో వడ్ల బస్తాలపైనే తాతామనుమడు ఒరిగి మృతి చెందారు. కొనుగోలు కేంద్రమే వారికి కాష్టమైంది. ఈ విషాద ఘటన మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం రామోజిపల్లిలో ఆదివారం చోటుచేసుకున్నది. ప్రభుత్వం సకాలంలో వడ్లు కొనుగోలు కొని వెంటనే కాంటా వేసి లోడు ఎత్తి ఉంటే తాతామనుమడు బతికేవారు. ఈ పాపం ఎవరిది? పోలీసులు, గ్రామస్థుల వివరాలు ప్రకారం.. రామోజిపల్లి గ్రామానికి చెందిన రైతు పాల్వంచ శ్రీరాములుకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. శ్రీరాములు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
యాసంగిలో రెండెకరాల్లో పండించిన వరిని కోసి గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో విక్రయించేందుకు నాలుగు రోజుల క్రితం ధాన్యం తెచ్చాడు. తేమశాతం ఎక్కువగా ఉన్నదని చెప్పడంతో అక్కడే ఆరబోశాడు. మూడు రోజుల తర్వాత శనివారం ధాన్యం కాంటా చేశారు. వెంటనే ధాన్యాన్ని తరలించక, ఆదివారానికి వాయిదా వేశారు. ఈలోగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకుని భారీ వర్షం రావడంతో వడ్ల బస్తాలపై టార్పాలిన్లు కప్పడానికి కొనుగోలు కేంద్రం వద్దకు తన మనుమడు (అన్న బిడ్డ కుమారుడు) శివరాజ్‌తో కలిసి వెళ్లాడు. ఆ సమయంలో పిడుగుపాటుకు గురై పాల్వంచ శ్రీరాములు (45)తోపాటు అతని మనుమడు శివరాజ్ (13) ధాన్యం బస్తాల మీద పడి చనిపోయారు. బాలుడు పెద్దశంకరంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. విషయం తెలుసుకున్న ఆర్ఐ శరణప్ప, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్‌కుమార్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం నుంచి పరిహారాన్ని అందజేస్తామని భరోసా ఇచ్చారు.
కొత్తగూడలో అత్యధికంగా 9.75 సెం.మీ
హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మేడ్చల్ -మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి సహా పలు జిల్లాల్లో సోమవారం వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. ఆదివారం రాష్ట్రంలో అత్యధికంగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో 9.75 సెం.మీ, జయశంకర్భూపాలపల్లిలో 8.98, వరంగల్‌లోని మంగళవారిపేటలో 8.28, హనుమకొండలోని మడికొండలో 6.03, కుమ్రంభీ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌యూలో 5.78 సెం.మీ, కామారెడ్డిలో 4.0 సెం.మీ., కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 3.58 సెం.మీ, సంగారెడ్డిలో 2.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో 40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆదిలాబాద్‌లో జిల్లాలో పలుచోట్ల వడగండ్లు
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని బెల్లూరి, బెల్లూరిగూడ, మాకోడ, భరోజ్, జైనథ్, నిరాల, గిమ్మ గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. గిమ్మలో నర్సరీ పనుల పరిశీలనకు వెళ్లిన రైతు కూలీలు, నాయకులపై పిడుగు పడటంతో మామిడిపెల్లి కిరణ్ (38) మృతి చెందారు. కోల భోజన్న, కూరేల్లి టిల్లు, కొండ రమేశ్, మంగ సంటెన్నలకు గాయాలయ్యాయి. వీరు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. బెల్లూరి గ్రామంలో 33/11 కేవీ విద్యుత్తు తీగలు తెగిపడ్డాయి. ఇండ్ల పైకప్పులు లేచిపోయాయి. చెట్లు విరిగి పడిపోయాయి. పెన్‌గంగ పరీవాహక గ్రామాల్లో రాళ్లవాన కురిసింది. జొన్న పంటలకు నష్టం వాటిల్లింది. నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసింది.
కామారెడ్డి జిల్లాలో మోస్తరు వర్షం
కామారెడ్డి జిల్లాలో ఆదివారం ఓ మోస్తరు వర్షం కురిసింది. కామారెడ్డి పట్టణంలో మధ్యాహ్నం వేళ గంటపాటు చిరుజల్లులు పడ్డాయి. మీసాన్‌పల్లి, భిక్కనూరు, శివ్వాపూర్, పెద్దారెడ్డి, మత్తమాల తదితర గ్రామాల్లో మోస్తరు వాన పడింది. గాంధారి మండలం సోమారంతండాలో ఈదురుగాలులకు కెతావత్ గఫ్పాకు చెందిన ఇంటి రేకులు ఎగిరిపోయి పక్కనే ఉన్న ఎద్దుపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. మాచారెడ్డితోపాటు గజ్యానాయక్ తండా, ఎక్స్‌రోడ్, ఘన్పూర్, అక్కాపూర్, పాల్వంచ, భవానీపేట, చుక్కాపూర్ గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. దోమకొండ మండలంలో తేలికపాటి వర్షం కురిసింది. బీబీపేట్ మండలంలో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఈదురుగాలులకు పలు గ్రామాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
ఆసిఫాబాద్‌లో గాలివాన బీభత్సం
ఆసిఫాబాద్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. పీటీజీ పాఠశాలలో పార్లమెంట్ ఎన్నికల సామగ్రి, ఈవీఎంల పంపిణీ కేంద్రంలో టెంట్లు కూలిపోయాయి. వర్షపు నీరు నిలవడంతో ఎన్నికల అధికారులు ఇబ్బందులుపడ్డారు. జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్ పార్ వద్ద రేకుల కప్పు ఎగిరి రోడ్డుపై పడింది. కాలనీలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. పొట్టిశ్రీరాములు చౌక్‌లో ఓ చెట్టు విరిగి రోడ్డుపై పడగా, రాకపోకలకు ఆటంకం కలిగింది. సందీప్‌నగర్‌లోని శాంతినికేతన్ పాఠశాల సమీపంలో చెట్టు విరిగి విద్యుత్తు స్తంభంపై పడింది. గుండి వాగుపై తాతాలిక వంతెన వర్షపు ప్రవాహానికి కొట్టుకుపోయింది. తుంపల్లికి చెందిన పొలవేని బీరయ్య ఇంటిపై చెట్టు విరిగిపడింది. ఆ సమయంలో భార్యాభర్తలిద్దరూ బయటకు వెళ్లడంతో ప్రమాదం తప్పింది. జైనూర్ మండలంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయండి ;గాలివాన, పిడుగుల నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరా
ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డితోపాటు పలు జిల్లాల పరిధిలో ఆదివారం గాలివాన, పిడుగులు పడి సంభవించిన నష్టంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. ఎకడైనా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచిపోతే, రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. మెదక్ జిల్లాలో పెద్ద శంకరంపేట మండలంలో పిడుగు పడి ఇద్దరు మృతి చెందిన ఘటనపై సీఎం విచారం వ్యక్తంచేశారు. వారి కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలంలోని గిమ్మ గ్రామంలో పిడుగుపాటుకు ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయని, వారికి తగిన వైద్య సాయం అందేలా చూడాలని అకడి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు పడుతాయని వాతావరణశాఖ సూచనలు ఉన్నందున జిల్లాల్లో కలెక్టర్లు, రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
నేడు వర్ష సూచన
పార్లమెంట్ నాలుగో విడుత ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం జరుగనున్నాయి. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా ఉపఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రాగల నాలుగు రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేరొన్నది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.