Rains | హైదరాబాద్ : రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ఈనెల 5న మహబూబ్నగర్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపవనాలు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి. దీని ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని పేర్కొంది. మంగళవారం ఉత్తర అరేబియా సముద్రం, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించాయి.
నైరుతి రుతుపవనాల విస్తరణ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధ, గురువారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని సూచించింది.
ఇక గురువారం కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మలాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఓ మోస్తరుగా వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు సూచించింది.
మూడు రోజులపాటు ఆయా ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ హెచ్చరికలను జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీట ర్ల వేగంతో కూడిన ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయ ణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ మంగళవారం వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా దిగువకు చేరాయి.