Telangana | హైదరాబాద్ : అకాల వర్షాలతో అల్లాడిపోతున్న రైతులకు మరో పిడుగులాంటి వార్తను వాతావరణ శాఖ చెప్పింది. వచ్చే వారంలో తూర్పు తీర రాష్ర్టాలకు తుఫాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాను బలపడే అవకాశాలున్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది.
రాష్ట్రంలో కొన్ని రోజులుగా వడగళ్లతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే అకాల వర్షాలతో రైతులు విలవిలలాడిపోతున్నారు. ఈ క్రమంలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మెస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలుల ప్రభావం ఉండవచ్చని తెలిపింది. ఈ గాలులు సుమారు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని ప్రకటనలో వెల్లడించింది.
ఈ నెల 6వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. దీని ప్రభావంతో 7వ తేదీన అదే ప్రాంతంలో ఆల్పపీడన ప్రదేశం ఏర్పడేందుకు అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ అధికారులు వివరించారు. ఆ తర్వాత ఇది తీవ్ర అల్పపీడనంగా కేంద్రీకృతమై మే 9వ తేదీ నాటికి తుపానుగా బలపడే అవకాశముందని పేర్కొంది. ఈ తుపాను ఉత్తర దిశగా కదులుతూ బంగాళాఖాతం వైపు కదులుతూ తీవ్రతరం అయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. బుధవారం దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఆవర్తన సగటు సముద్ర మట్టానికి సుమారు కిలో మీటరు ఎత్తులో స్థిరంగా కొనసాగుతుందని వివరించారు.
ఈ తుపాను ఏర్పడితే దానికి ‘మోచా’ అని పేరు పెట్టనున్నట్లు ఐఎండీ తెలిపింది. యెమెన్ దేశంలోని పోర్టు నగరమైన మోచా పేరు పెట్టినట్లు పేర్కొంది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత తుపాను దిశ గురించి మరింత కచ్చితమైన సమాచారం తెలుస్తుందని ఐఎండీ వెల్లడించింది. వచ్చేవారంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని పేర్కొంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లోద్దని హెచ్చరించింది. సాధారణంగా రుతుపవనాలకు ముందు ఏప్రిల్-మే-జూన్ సీజన్లో బంగాళాఖాతంలో తరచూ తుఫానులుగా ఏర్పడుతుంటాయి. మేలో వీటి ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక దేశంలో అక్టోబరు-డిసెంబర్ మధ్య తిరోగమన రుతుపవనాల ప్రభావంతో మరో తుఫాను సీజన్ ఉంటుంది. వీటికి తోడు పశ్చిమతీరంలోని అరేబియాసముద్రంలో కూడా తుపానులు ఏర్పడుతుంటాయి.