Heavy Rains | హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమసే తెలంగాణ): వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ర్టాల్లో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శని, ఆదివారాల్లో తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మూడు, నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని సూచించింది.
ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా వాతావరణం గందరగోళంగా ఉన్నది. ఆలస్యంగా వచ్చిన నైరుతీ రుతుపవనాలు క్రియశీలకంగా ఉన్నాయి. సెప్టెంబర్ 9 నుంచి అవి తిరోగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి ముందస్తుగానే ఈశాన్య రుతుపవనాల రాక మొదలు కావొచ్చని ఐఎండీ అంచనా వేస్తున్నది.