Rain Update | హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): నైరుతి బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. దీని ప్రభావంతో బుధవారం తెలంగాణలోని పలుచోట్ల వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌లో చిరుజల్లులు కురుస్తున్నాయి. గురువారం రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ, వరంగల్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్‌తో పాటు నిర్మల్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. వాయుగుండం ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షా లు కురిసే అవకాశం ఉన్నది. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): అక్టోబరు -నవంబర్ మధ్య కాలంలో ఏర్పడే ‘లానినా’ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో శీతాకాల ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతాయని ఇండియన్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ తెలిపింది. ఓవైపు వర్షాకాలం ముగిసినా, వాయుగుండం ఎఫెక్ట్‌తో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నా యి. మరో వారంలో ఈ వానలు తగ్గుతాయి. కాగా, ఈ ఏడాది శీతాకాలంలో హైదరాబాద్‌లో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎం డీ హెచ్చరించింది. 2024 జనవరిలోనే హైదరాబాద్ సిటీలో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సారి 5,6 డిగ్రీలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ హెచ్చరించింది. ఈ ఏడాది శీతాకాలం సవాల్‌తో కూడుకున్నదని అంచనా వేసిన వాతావరణ శాఖ, తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా ఉదయాన్నే పొగమంచు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.